‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ లో డీ గ్లామర్ లుక్ లో కనిపించిన అనుష్క, రెండవ పార్ట్ లో మాత్రం అదిరిపోయే రేంజ్ లో కనపడనుందన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. ‘బాహుబలి’ని ప్రేమించిన యువతిగా కనపడనున్న అనుష్క – ప్రభాస్ ల మధ్య ఒక్క డ్యూయెట్ సాంగ్ కూడా లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కీరవాణి విడుదల చేసిన ట్రాక్ లిస్టును పరిశీలిస్తే… ఒక్క ‘కన్నా నిదురించారా’ అనే పాట తప్ప మిగతా నాలుగు పాటలు ఒక్కొక్కరు పాడినవే ఉండడం విశేషం.
అలాగే ‘కన్నా నిదురించారా’ అన్న సాహిత్యం బట్టి చూస్తే, ఇది కూడా డ్యూయెట్ సాంగ్ అయ్యే అవకాశం లేదు. దీంతో ‘బాహుబలి 2’లో రొమాంటిక్ సాంగ్ కు ఆస్కారం లేదన్న విషయం అర్ధమవుతోంది. ఫస్ట్ పార్ట్ లో తమన్నా పరువాలను ఓ పాటలో అద్భుతంగా చూపించిన జక్కన్న, రెండవ పార్ట్ లో అనుష్కతో కూడా ఇలాంటి ఓ సాంగ్ ఉంటుందని భావించారు. కానీ, పాటల జాబితాతో ‘బాహుబలి – దేవసన’లు పాటలు పాడుకోవడానికి సమయం లేకుండా రాజమౌళి కధను తీర్చిదిద్దినట్లున్నారు.
ఇక ఈ ఆల్బమ్ ను విడుదల చేయడానికి సర్వహంగులు సిద్ధం చేస్తోంది చిత్ర యూనిట్. రాబోయే ఆదివారం నాడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఆడియో వేడుకను అంగరంగ వైభవంగా జరపనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జక్కన్నే స్వయంగా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ముందుగా చెప్పినట్లుగా ఈ పాటల జాబితాను చూస్తుంటే ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ కంటెంట్ ఉన్న ఏమోషనల్ కధగా కనపడుతోంది. దానికి తగిన విధంగా ఈ లిరిక్స్ కనపడుతున్నాయి.




