పది మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితాను కాసేపటి క్రితం విడుదల చేసింది. దీంతో తొలి జాబితా, రెండో జాబితా కలిపి మొత్తం 75 మంది అభ్యర్థుల జాబితా విడుదలయింది. ఇప్పటిదాకా విడుదల చేసిన జాబితాలలో అత్యధికంగా 30 మంది రెడ్దలకు సీట్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణాలో దాదాపుగా సగం ఉండే బీసీలకు మాత్రం మొండి చెయ్యి చూపించింది అనే అనుకోవాలి.
[m9ad]
ఇప్పటిదాకా విడుదల చేసిన జాబితాలలో పట్టుమని పదిహేను మంది బీసీలకు కూడా చోటు దక్కలేదు. దీనితో బీసీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. అయితే అధికార తెరాసకూడా బీసీలకేమి న్యాయం చెయ్యలేదు. ఇప్పటిదాకా ప్రకటించిన 107 అభ్యర్థులకు గాను ఒక 20 సీట్లు బీసీలకు ఇచ్చి ఉంటారు. అందులో కూడా కొంత మందిని పాత బస్తిలో ఎంఐఎంకు స్నేహపూర్వక పోటీలో పెట్టారు. సిపిఎం, బీఎస్పీ వంటి చిన్న చిన్న పార్టీలు ఉన్న బీఎల్ఎఫ్ మాత్రమే బీసీలకు కొంత మేర బాగా సీట్లు ఇచ్చింది.
బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్ని పార్టీలు బీసీలను మోసం చేసినందుకు గానూ ఈ నెల 17న తెలంగాణ వ్యాప్త బందుకు పిలుపునిచ్చారు. జనాభాలో సగం ఉన్న వర్గాలను చులకన చేస్తూ అన్యాయం చేస్తున్నాయని ఆరోపణ. గతంలో టీడీపీ తెలంగాణాలో బలీయంగా ఉన్నప్పుడు ఎప్పుడూ బీసీలకు పెద్ద పీట వేసేది. ఇప్పుడు ఆ పార్టీ పట్టుమని పాతిక సీట్లలో పోటీ చేసే ఇది లేకపోవడంతో తెలంగాణాలో బీసీలకు ప్రాధాన్యత అనేది లేకుండా పోయింది. టీడీపీ వీక్ అవ్వడంతో తెలంగాణ బీసీలు నష్టపోయారా? అంటే అవును అనే చెప్పాలి.



