ఇంతవరకు ‘సర్’ అంటే ఓ గౌరవం కానీ ఇప్పుడు ‘సర్’ అంటే ప్రతిపక్షాలకు గుండెల్లో గుబులు. సర్ పేరుతో తమ పార్టీలకు ఓట్లు వేసే వారి పేర్లను ఓటర్ల జాబితాలో నుంచి తొలగించేసి దెబ్బ తీస్తోందని ఆరోపిస్తున్నాయి. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దీనిలోనే ఓ గొప్ప అవకాశాన్ని చూసింది.
ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చి ముఖ్యంగా హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడినవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిలో చాలా మందికి ఆంధ్రా, తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.
తెలంగాణలో స్థిరపడిన ఈ ఆంధ్రా ఓటర్లు ఎన్నికల సమయంలో టీడీపి, వైసీపీ, జనసేన పార్టీల ప్రభావానికి లోనవడం సహజం. గత ఎన్నికలలో వారు ఆవిధంగా ప్రభావితమై కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందునే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడమే ఇందుకు ఓ చక్కటి నిదర్శనం.
కనుక వారు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తూ తమ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. కానీ ఈ మాట బహిరంగం చెప్పలేదు. చెప్తే ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది.
అందుకే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారిని గుర్తించేందుకు ఇంటింటికీ సర్వే చేయించింది కూడా. కానీ ఫలితం లేకుండా పోయింది.
కనీసం ఇప్పుడీ సర్ ప్రక్రియలో అటువంటి వారిని గుర్తించి ఓటర్ల జాబితాలో నుంచి వారి పేర్లను తొలగించగలిగితే ఇకపై వారి వలన బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలలో నష్టం ఉండదని భావించింది.
అందువల్లే కాంగ్రెస్, బిజేపిల కంటే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సర్ అవగాహనా సదస్సులు నిర్వహించింది. పార్టీ నేతలు, కార్యకర్తలకు ఈ బాధ్యత అప్పగించింది. వారు బీఎల్‌వోలు సక్రమంగా ఓటర్ల వివరాలు నమోదు చేస్తున్నారా లేదా? అని నిరంతరం పరిశీలిస్తోంది.
ఈ నెల 24లోగా ఈ సర్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం గడువు విధించగా ఇప్పటి వరకు కేవలం 7 శాతం మంది వివరాలు మాత్రమే బీఎల్‌వోలు సేకరించారని బీఆర్ఎస్ పార్టీ నేతలు వాదిస్తున్నారు.
ఈ లెక్కన గడువులోగా రాష్ట్రంలో ఓటర్ల అందరి వివరాలు సమగ్రంగా సేకరించడం అసాధ్యమని కనుక గడువు పెంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని నిన్న కలిసి విజ్ఞప్తి చేశారు.
సర్ పేరుతో తమ పార్టీ ఓట్లు ఎక్కడో పోతాయోనని మొదట ఆందోళన చెందిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు సర్ గడువు పొడిగించాలని కోరుతుండటం విశేషం.




