హీరోల సినిమాలను అభిమానులు చూడడం సాధారణమే. అయితే అభిమాని నటించిన సినిమాను హీరో చూడడమనేది ఒక గొప్ప అనుభూతి. ప్రస్తుతం అలాంటి అనుభూతినే తాము ఫీల్ అవుతున్నాము అంటున్నారు “కృష్ణగాడి వీరప్రేమగాధ” సినిమా నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర.
ఈ సినిమాలో ‘లెజెండ్’ బాలకృష్ణకు అభిమానిగా హీరో నాని నటించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్ విజయయాత్రలు చేస్తుంటే, మరో వైపు తమ అభిమాన హీరో స్వయంగా చిత్రాన్ని వీక్షిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అనిల్ సుంకర తన ట్విట్టర్ లో తెలిపారు.
ఎలాంటి బేషజాలు లేని హీరోలలో బాలకృష్ణ ఒకరు. చిన్నపిల్లాడు మాదిరి ఎంజాయ్ చేసే బాలయ్య బాబుతో ఇప్పటికే “లెజెండ్” చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ, బాలయ్య 100వ సినిమాను నిర్మించడానికి కూడా సిద్ధమవుతోంది.



