నందమూరి నటసింహం నటించిన “డిక్టేటర్” సినిమా ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోంది. అభిమాన వర్గాలను మెప్పిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు బాగా విస్తృతంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన 100వ సినిమా గురించి, భవిష్యత్తు సినిమాల గురించి బాలకృష్ణ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
“తానూ నటించే 100వ సినిమాపై మరో వారం, పది రోజుల్లో స్పష్టత వస్తుందని, ఏ సినిమా అయినా కధే నాదే అని, ‘ఆదిత్యా999’ సినిమా కధ ఇప్పటికే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారికి చెప్పానని, తానూ ఎప్పుడూ నమ్మే ‘కట్టే కొట్టే తెచ్చా’ రీతిలో చెప్పిన లైన్ కు… ఎంతసేపు ఈ కధ కోసం ఆలోచించారని, రాత్రంతా నిద్ర పట్టిందా అని దర్శకుడు అడిగారని, నేను కధ ఆలోచించడానికి అయిదు నిముషాల సమయం పడుతుందని, ఇపుడు ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో కూడా ఓ కధ వచ్చిందని” బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
బోయపాటి శ్రీనివాస్ గారితో ఓ సినిమా చేయాలని, ‘ఆదిత్యా 999’ సినిమా కూడా చేయాలి… అయితే ఈ రెండింటిలో ఏది 100వ సినిమా అన్నది మరికొద్ది రోజుల్లో చెప్తానన్న బాలకృష్ణ, 2016 సంవత్సరంలో నాలుగైదు సినిమాల్లో నటిస్తానని, తన కొడుకు, మనవడు వచ్చే వరకు సినిమాల్లో నటిస్తానే ఉంటానని చెప్పిన బాలకృష్ణ వ్యాఖ్యలతో అభిమానులు ఖుషీగా ఉన్నారు.





