‘రొమాలు నిక్క పొడిచేలా’ డైలాగ్ లను పలికించడంలో నందమూరి నటసింహం ప్రావీణ్యత తెలియనిది కాదు. అలాగే ‘వన్ లైన్ వండర్స్’ను అందించడంలో సిద్ధహస్తుడు పూరీ జగన్నాధ్. మరి వీరిద్దరి కలయికలో వస్తున్న బాలకృష్ణ 101వ సినిమాలో డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయి? మచ్చుకు ఒక్క డైలాగ్ చెప్పండి అంటూ… నందమూరి అభిమానులు పూరీని అడిగినపుడు వచ్చిన బదులు ఏమిటో తెలుసా?
“ఒక్క డైలాగ్ కాదు… ఆడియో సీడీ వేసుకునేనన్నీ డైలాగ్స్ ఉంటాయి, నో డౌట్” అని చెప్పడంతో ఫ్యాన్స్ లో హుషారు తారస్థాయికి చేరుకుంది. అభిమానులు ఊహించే దాని కన్నా ఎక్కువ సంతృప్తిని ఇచ్చేలా ఈ చిత్రాన్ని తయారు చేస్తానని హామీ ఇచ్చిన పూరీ, తాను నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా తీయాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశానని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందని అన్నారు.
తనకు ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణను ఎన్నటికీ మరచిపోలేనని, “మీ అభిమానులందరికీ మాటిస్తున్నాను, మీకు ఏం కావాలంటే… ఎలా కావాలంటే… ‘ఆ’ రేంజ్ లో వుంటుంది. సో… ఆయన డైలాగులు కానీ, ఆయన లుక్ గానీ… జై బాలయ్య… సినిమా వెంటనే ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 29న రిలీజ్… కావాలంటే ఒక రోజు ముందే అయినా రిలీజ్ కు రెడీ. థ్యాంక్యూ… థ్యాంక్యూ సో మచ్…” అంటూ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించాడు.
ఇక బాలయ్య మాట్లాడుతూ… ఇవాళ ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారన్న సంగతి తనకు తెలుసని, మన అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా, అందరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందని సభా ముఖంగా తెలియజేసుకుంటున్నాను అని అభిమానుల కోలాహలం మధ్య బాలయ్య ప్రకటించారు. క్యాస్టింగ్ విషయం దర్శకులు పూరీ చూసుకుంటారని తెలిపిన బాలయ్య, ఆ స్వామి వారి ఆశీస్సులు చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.



