కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపి ఎంపీ బండి సంజయ్ దీపావళి పండగకు ముందు నేడు ఓ బాంబు పేల్చారు. తెలంగాణ రాజకీయ నాయకులకు ఇదే చివరి హెచ్చరిక! ఓ పక్క ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉగ్రవాదులు, మావోయిస్టుల వంటి వారితో రహస్య సంబంధాలున్నవారు చాలా మందే ఉన్నారు. అటువంటివారు తక్షణం వారితో సంబంధాలు తెన్చేసుకోండి. లేకుంటే రేపు నిఘా సంస్థలు మీ భరతం పడతాయి.
మావోయిస్టుల ఏరివేతతోనే ఈ కార్యక్రమం ముగిసిపోదు. తీవ్రవాదులు, మావోయిస్టులు, అవినీతిపరులు, నేరాలకు పాల్పడేవారినందరినీ ఏరి పారేయాలని కేంద్ర ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉంది. తెలంగాణలో అటువంటి రాజకీయ నాయకుల జాబితా నిఘా సంస్థ సేకరిస్తోంది.
మావోయిస్టుల తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలో అటువంటి వారినందరినీ ఏరి పారేయబోతోంది. కనుక ఇదే చివరి హెచ్చరికగా భావించి తక్షణం అసాంఘిక శక్తులతో మీ సంబంధాలు తెంచేసుకోండి. లేకుంటే తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు,” అని బండి సంజయ్ హెచ్చరించారు.
హైదరాబాద్ పాతబస్తీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజలకు మజ్లీస్ పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని బండి సంజయ్ తరచూ ఆరోపిస్తూనే ఉంటారు. వామపక్షాలకు సాయుధ పోరాటా శక్తులతో ఉన్న అవినాభావ సంబంధాలు అందరికీ తెలిసినవే. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం మట్టుబెడుతుండటాన్ని వామపక్ష నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
దేశంలో పలు రాజకీయ పార్టీల నేతలకు మావోయిస్టులతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలున్నాయని అప్పుడప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. కనుక ఆ సంబంధాలే తెంచుకోమని లేకుంటే ఇబ్బందులలో పడతారని బండి సంజయ్ హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ ప్రకటించి మావోయిస్టులను ఎరివేస్తున్నప్పుడు, దానిని అడ్డుకునేందుకు అనేక పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేశాయి. కానీ ఎన్ని విమర్శలు వస్తున్నా కేంద్రం వెనక్కు తగ్గలేదు. కనుక మావోయిస్టులు ప్రాణ భయంతో పోలీసులకు లొంగిపోతున్నారు. ‘ఆపరేషన్ కగార్’ వంటి మారణ హోమాన్నే ఆపని కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ హెచ్చరికను తేలికగా కొట్టి పడేయలేము. ‘ఆపరేషన్ కగార్’తర్వాత ఈ కొత్త ఆపరేషన్ మొదలవుతుందేమో?







