అప్ డేట్ అవుతోన్న ట్రెండ్ లో భాగంగా సినీ ప్రమోషన్స్ కొత్తపుంతలు తొక్కుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఫస్ట్ లుక్, టీజర్, సింగిల్ సాంగ్స్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూస్… ఇలా వరుస క్రమంలో వెళ్తున్నాయి. ఈ వరుసలో అన్నీ బాగానే ఉన్నాయి గానీ, ఒక్కొక్క పాటను విడుదల చేస్తోన్న విధానం మాత్రం యూనివర్సల్ గా క్లిక్ కాలేదు.
ముఖ్యంగా ఈ సింగిల్ సాంగ్స్ రిలీజ్ విధానం ఆడియోను హిట్ అవ్వకుండా చేయడంలో పూర్తిగా విజయవంతం అవుతోంది. అందుకే ఈ మధ్య కాలంలో ఏదో ఒకటి, రెండు సినిమాల ఆడియోలు మినహా, మిగతావి కనీసం పట్టుమని నెల రోజులు కూడా వినిపించడం లేదు. బహుశా ఈ ఒరవడిని ‘భరత్ అనే నేను’ చిత్ర యూనిట్ గ్రహించిందేమో గానీ, సింగిల్ సాంగ్స్ రిలీజ్ ను ప్రోత్సహించకపోవడం విశేషం.
నిజానికి ఈ ఉగాది నాడు మొదటి పాటను రిలీజ్ చేస్తారని అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేసినప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం దీన్ని ధృవీకరించలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం… సింగిల్ సాంగ్స్ కాకుండా ఏకంగా ఆల్బమ్ మొత్తం ఏప్రిల్ 7వ తేదీన విశాఖపట్టణంలో ఓ భారీ ఈవెంట్ లో విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే అంతకంటే ముందుగా ఒక్క పాటనైతే విడుదల చేయాలని భావిస్తున్నారట.



