ప్రిన్స్ మహేష్ బాబు… లోకల్ గా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, పొరుగు రాష్ట్రాలలో ఎంత అభిమాన బలగం ఉందో… నేషనల్ వైడ్ గా అంతే పాపులారిటీ ఉన్న హీరో. ఇక యుఎస్ మార్కెట్ లో అయితే తిరుగులేని ‘కింగ్’గా అభిమానుల చేత నీరాజనాలు అందుకుంటున్న హీరో. నిజమే… కానీ ప్రస్తుతం ఎన్నడూ లేనంత ఒత్తిడిలో ప్రిన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణాలు… ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ సినిమాల ఫలితాలేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
రెండు వరుస డిజాస్టర్స్ పడ్డప్పటికీ, ప్రిన్స్ పాపులారిటీలో ఏ మాత్రం తేడా లేకపోగా, తాజాగా ఏప్రిల్ 20వ తేదీన విడుదల సిద్ధమవుతున్న “భరత్ అనే నేను”కు మళ్ళీ రికార్డ్ స్థాయిలో మార్కెట్ అవుతుండడం ఈ ఒత్తిడిని మరింత పెంచుతోంది. విడుదలకు ముందు రికార్డ్ స్థాయిలో జరుగుతోన్న వ్యాపారానికి… రిలీజ్ తర్వాత వసూలు అవుతున్న మొత్తానికి… గత రెండు సినిమాల విషయంలో పొంతన లేకపోవడంతో, ఈ సారి ఎలాగైనా తన స్టామినాను ప్రిన్స్ నిరూపించుకోవాల్సి ఉంది.
అంతేగాక ‘నా పేరు సూర్య’ సినిమాతో పడిన పోటీ నేపధ్యంలో… సినిమా ఒక వారం రోజులు ప్రీ పోన్ కావడంతో, ఆ డేట్ కు తగ్గట్లుగా షూటింగ్ ముగించాల్సి ఉంటుంది, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యే వరకు మహేష్ పైన పూర్తి స్థాయిలో ప్రెషర్ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. అందులోనూ ఏప్రిల్ 20 తర్వాత వరుసగా పెద్ద సినిమాలు విడుదల అవుతుండడంతో, బాక్సాఫీస్ వద్ద నిలబడాలంటే, సక్సెస్ అనేది ఓ రేంజ్ లో ఉండాల్సిందే!
గత రెండు సినిమాల ప్రభావంతో… మహేష్ తర్వాత స్థాయి హీరోలు కూడా తాను కూడా మహేష్ రేంజ్ అన్న రేంజ్ లో ఫీల్ అవుతున్నారనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ఇండస్ట్రీలో ‘సక్సెస్’ మాత్రమే కొలమానం కాబట్టి, వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి గానీ, ప్రిన్స్ 20 ఏళ్ళ కెరీర్ లో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో ఉన్నారన్న మాట అయితే నిజం… అది అటు సక్సెస్ పరంగానూ… ఇటు అనుకున్న సమయానికి రిలీజ్ చేయాల్సిన విషయంలోనూ..! అభిమానులంతా కొరటాల పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు!



