పెద్ద హీరోల సినిమాల న్యూస్ బయటకు రావడం కంటే ముందుగా వాటిపై గాసిప్స్ వచ్చేస్తున్నాయి. ఆ క్రమంలోనే ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న 25వ చిత్రంపై రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. హాలీవుడ్ సినిమాకు కాపీ అని ఒకళ్ళు, ఆస్ట్రేలియన్ టీవీ సిరీస్ నుండి ప్రేరణ పొందిందని ఇంకొకళ్ళు… ఇలా ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు ప్రచారం చేస్తుంటే… వీటిని ఖండించాల్సిన ఆవశ్యకత దర్శకుడు వంశీ పైడిపల్లికి వచ్చింది.
మహేష్ బాబు నటిస్తోన్న 25వ చిత్రంపై వస్తోన్న పుకార్లన్నీ అబద్దాలేనని, ఈ సినిమా కధ దేనికీ కాపీ కాదు, అలాగే ఏ టీవీ సిరీస్ కు సంబంధం లేదని వంశీ పైడిపల్లి స్పష్టం చేసారు. యూ ట్యూబ్ లో విచ్చలవిడిగా కొనసాగుతోన్న వీడియోల రూపకల్పనలో భాగంగా పుట్టుకొస్తున్న ఈ పుకార్లను వీక్షకులు నిజమనుకునే ప్రమాదం ఉండడంతో, ఇలా సినీ ఇండస్ట్రీల వాళ్ళు భయపడి ముందు జాగ్రత్త చర్యలుగా స్పష్టత ఇస్తున్నారు.
ఈ యూ ట్యూబ్ వీడియోల టైటిల్స్ గురించే శుక్రవారం నాడు హీరో శ్రీకాంత్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేయగా, దానికి హరీష్ శంకర్ వంటి అనేక మంది సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. అసలు వార్తను పక్కన పెట్టే విధంగా యూ ట్యూబ్ లో వీడియోలు ఉండడం, సినీ సెలబ్రిటీలకు తీవ్ర ఆవేదనను మిగులుస్తోంది. ఇందుకు పెద్ద, చిన్న దర్శకులు, హీరోలు అన్న తేడా లేకుండా పోయిందని తాజా సంఘటన చెప్పకనే చెప్పింది.



