బిచ్చగాడు… బహుశా ఈ సినిమా విడుదల అయ్యింది అన్న విషయం కూడా చాలా మంది సినీ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. ఎందుకంటే… బిచ్చగాడు విడుదలైన తర్వాత వారంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ విడుదల కానుందన్న ఉత్సాహం ‘బిచ్చగాడు’ని కనుమరుగు చేసింది. అయితే, సరిగ్గా వారం ముగిసే సమయానికి ‘బ్రహ్మోత్సవం’ సినిమాను పక్కనపెట్టి, ఎగ్జిబిటర్లు ‘బిచ్చగాడు’ సినిమా ప్రింట్లను తెప్పించుకుని ప్రదర్శించారు. అప్పటికే ‘బిచ్చగాడు’ దెబ్బకు ‘బ్రహ్మోత్సవం’ కెవ్వు కేక పెట్టింది.
అయితే అది ‘బ్రహ్మోత్సవం’తోనే ముగిసిందనుకుంటే పొరపాటే. అప్పటివరకు బాక్సాఫీస్ ని ఏలిన ‘సరైనోడు’ సినిమాను, అలాగే ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటిన ‘అ…ఆ…’ సినిమా ప్రభంజనాన్ని కూడా తట్టుకుని, ఇప్పటికీ దాదాపు 70 శాతం ఆక్యుపెన్సీతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ‘బిచ్చగాడు’ సినిమాకు ముందు వచ్చిన పెద్ద సినిమాలు, ఆ తర్వాత విడుదలైన అగ్ర చిత్రాలు ధియేటర్లను వీడిపోయాయి గానీ, ‘బిచ్చగాడు’ మాత్రం కోట్లకు కోట్లు వసూలు చేస్తూ నిర్మాతకు అసలైన పండగను రుచి చూపిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ కు సంబంధించి నిర్మాత ఒక ప్రకటన చేసారు. తమ ‘బిచ్చగాడు’ ఇప్పటివరకు 25 కోట్లు వసూలు చేసిందని, ఇదే ఒరవడి కొనసాగితే 30 నుండి 35 కోట్ల మధ్య కలెక్షన్స్ ఉండవచ్చని నిర్మాతలు తెలిపారు. ఆంధ్రాలో దాదాపుగా 11 కోట్లను టచ్ చేస్తుండగా, సీడెడ్ లో 7 కోట్లు, నైజాంలో 7 కోట్లు వరకు కలెక్ట్ చేసినట్లుగా నిర్మాతలు తెలిపారు. ఒక డబ్బింగ్ సినిమా స్టార్ హీరో విజయ్ రేంజ్ కలెక్షన్స్ ను కొల్లగొట్టడం సామాన్యమైన విషయం కాదని సినీ పండితులు నోరెళ్ళ బెడుతున్నారు.



