ఏపీలో టిడిపి-జనసేన-బీజేపీల మద్య సంబంధాలపై రాష్ట్ర ప్రజలకే కాదు… బీజేపీ నేతలకు కూడా క్లారిటీ లేదంటే ఆశ్చర్యంగా ఉంది.
ఇటీవల ఏపీలో పర్యటించిన బీజేపీ అగ్రనేతలు బిఎల్ సంతోష్, ఎంపీ జీవిఎల్ నరసింహారావు జనసేనతో పొత్తు ఉందని ఈ విషయంలో బీజేపీ శ్రేణులు ఎటువంటి అనుమానాలు పెట్టుకోనవసరంలేదని నొక్కి చెప్పారు. అయితే వేరే పార్టీతో (టిడిపి)తో పొత్తుల గురించి అధిష్టానం నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలని, పార్టీలో ఎవరూ దీని గురించి మీడియాతో మాట్లాడరాదని గట్టిగా హెచ్చరించారు.
తమతో పొత్తులో ఉన్న జనసేన టిడిపితో పొత్తు పెట్టుకొని కలిసి పనిచేస్తోందని, రెండు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టోని త్వరలో విడుదల చేయబోతున్నాయని బీజేపీకి తెలుసు. అయినా టిడిపితో జనసేన పొత్తు, టిడిపి తమ పార్టీ పొత్తు గురించి బీజేపీ నేతలెవరూ నోరు మెదపడం లేదు! బహుశః తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే మౌనం వహిస్తున్నారేమో?
జనసేనతో పొత్తు పెట్టుకొన్నందుకే తెలంగాణలో బిఆర్ఎస్ నేతలు బీజేపీని తప్పు పడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతుగానే టిడిపి, వైఎస్సార్ టిపి ఎన్నికల బరిలో నుంచి తప్పుకొన్నాయని, కాంగ్రెస్, బీజేపీల ముసుగులో ఆంధ్రా పార్టీలు తెలంగాణపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నాయని వాదిస్తున్నారు.
బహుశః ఇందుకే బీజేపీ అధిష్టానం ఏపీలో టిడిపితో పొత్తుల గురించి తొందరపడటం లేదని భావించవచ్చు. అయితే ఏపీలో తమ మిత్రపక్షమైన జనసేన, టిడిపితో పొత్తు పెట్టుకొందని తెలిసి ఉన్నప్పటికీ దానితో కలిసే సాగుతామని చెపుతున్నారు.
అంటే తెలంగాణ ఎన్నికల తర్వాత ‘ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా’ టిడిపితో కూడా పొత్తు పెట్టుకొంటునట్లు బీజేపీ అధిష్టానం నిర్ధిష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఒకవేళ టిడిపితో పొత్తు వద్దనుకొంటే జనసేనను దాని నుంచి వేరు చేసి బయటకు తీసుకుపోవాలి. కానీ పవన్ కళ్యాణ్ అందుకు అంగీకరించరు. ఇప్పటికే టిడిపి, జనసేనలు కలిసి ప్రజల మద్యకు వెళుతున్నాయి. నేడో రేపో ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నాయి.
కనుక ఏపీ బీజేపీ ముందు మూడు మార్గాలున్నాయి. 1. టిడిపి, జనసేనలతో కలిసి సాగడం, 2. వైసీపితో పొత్తు పెట్టుకోవడం, 3. ఒంటరిగా పోటీ చేయడం.
“బీజేపీ లక్ష్యం ఒకటో రెండో సీట్లు గెలుచుకోవడం కాదు. ఎప్పటికైనా ఆంధ్రాలో అధికారంలోకి రావడమే” అని బిఎల్ సంతోష్ స్పష్టంగా చెప్పిన మాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకొంటే, ఆ లక్ష్యం సాధించేందుకు బీజేపీ, టిడిపి, జనసేనలతో పొత్తులకే మొగ్గు చూపవచ్చు. అప్పుడే అది ఆంధ్రా ప్రజలకు దగ్గరవగలదు.
బీజేపీ అధిష్టానం అనుమతితోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైసీపి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ యుద్ధం చేస్తున్నారని వేరే చెప్పక్కరలేదు. కనుక వైసీపితో బీజేపీ పొత్తులు పెట్టుకొనే ఆలోచనలో లేదని స్పష్టమవుతోంది. అలాగని ఏపీలో ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందాలని బీజేపీ కోరుకోదు.
డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఏ క్షణంలోనైనా బీజేపీ అధిష్టానం ఏపీలో పొత్తులపై నిర్ధిష్ట ప్రకటన చేయడం ఖాయమే.




