బిజెపికి పూర్తి క్లారిటీ ఉంది… ఆలోచించుకోవాల్సింది జనసేన, టిడిపిలే

Narendra-Modi-YS-Jagan-Reddyరాష్ట్ర విభజన వలన ఏపీకి రూ.22,948.76 కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడగా దానిని కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేస్తుందని హామీ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్ధిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నందున తక్షణమే ఆ నిధులను విడుదల చేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రధాని నరేంద్రమోడీని కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ కేవలం రూ.4,117.89 కోట్లు మాత్రమే విడుదల చేశారు.

అప్పుడు చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ మిగిలిన బకాయిల విడుదల చేయాలని ఎన్నిసార్లు కోరినా విడుదల చేయలేదు. కానీ రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం దానిలో రూ.10,460 కోట్లు విడుదల చేసింది.

ADVERTISEMENT

తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న జగన్ ప్రభుత్వానికి ఒకేసారి ఇన్నివేల కోట్లు చేతికి అందడంతో చాలా ఊరట లభిస్తుందని వేరే చెప్పక్కరలేదు. ఏపీకి పదేళ్ళ పాత బకాయిలను ఇప్పటికైనా కేంద్రం విడుదల చేసినందుకు సంతోషించాల్సిందే. అయితే దానిని సద్వినియోగం చేస్తే, అంటే అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తే అందరూ సంతోషిస్తారు. కానీ జగన్ ప్రభుత్వం దానిని అప్పులు, వడ్డీల చెల్లింపులకి, సంక్షేమ పధకాల కోసం ఖర్చు చేస్తుందని వేరే చెప్పక్కరలేదు. అంటే కేంద్రం అందించిన సాయం ఏట్లో పిసికిన చింతపండే అనుకోవచ్చు.

అయితే జగన్ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని, ఆ కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజుతో సహా ఆ పార్టీ నేతలందరూ ఆరోపిస్తూ వారిపై ఛార్జ్ షీట్లు విడుదల చేస్తుంటారు. జగన్ ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు.

ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని తెలిసి ఉన్నప్పటికీ కేంద్రం నిధులు ఎందుకు విడుదల చేయలేదు? ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని, అవినీతికి పాల్పడుతోందని బిజెపి నేతలే ఆరోపిస్తున్నప్పుడు ఇన్నివేల కోట్లు జగన్ ప్రభుత్వం చేతిలో ఎందుకు పెట్టిన్నట్లు?అనే సందేహం కలుగకమానదు.

బహుశః ఏపీ రాజకీయాలను, బిజెపి భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే నిధులు విడుదల చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీ బిజెపితో కంటే టిడిపితోనే సన్నిహితంగా ఉంటోంది. కనుక ఏపీలో బిజెపి ఒంటరి అవుతుందని స్పష్టం అవుతోంది. ఓ వైపు కాంగ్రెస్‌ మిత్రపక్షాలు, మరోవైపు కేసీఆర్‌ కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు చురుకుగా పావులు కదుపుతున్నారు. కనుక ఈసారి లోక్‌సభలో ఎన్నికలలో బిజెపికి ఎదురీత తప్పకపోవచ్చు. అప్పుడు కేంద్రంలో మళ్ళీ బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకి వైసీపీ వంటి పార్టీల మద్దతు అవసరం ఉంటుంది. కనుక బిజెపి భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే ఈవిదంగా జగన్ ప్రభుత్వానికి సాయపడుతూ వైసీపీకి పరోక్షంగా సంఘీభావం తెలుపుతోందని భావించవచ్చు.

అంటే బిజెపి ఏపీలో టిడిపి, జనసేనల కంటే వైసీపీయే మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకొంటున్నట్లు భావించవచ్చు. కనుక ఏపీ రాజకీయాల పట్ల బిజెపి అధిష్టానానికి పూర్తి స్పష్టత ఉందనే అర్దం అవుతోంది. కనుక ఇక ఆలోచించుకోవలసింది జనసేన, టిడిపిలే!

ADVERTISEMENT
Latest Stories