
2024 ఏపీ ఎన్నికలు ఒకే కుటుంబంలో ఉన్న రాజకీయ శత్రుత్వాన్ని బయటపెడితే, మరో రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరాన్ని సృష్టించాయి. షర్మిల ఏపీ పొలిటికల్ ఎంట్రీ తో షర్మిల vs జగన్ గా సాగిన ఎన్నికల ప్రచారంలో పార్టీ పరంగా జగన్ పై చేయి సాధిస్తే, రాజకీయంగా అన్నను దెబ్బ కొట్టగలిగింది షర్మిల.
Also Read – వైసీపీ చరిత్ర బయటవారే చెప్పాలా… వద్దు!
అలాగే “కొణిదెల, అల్లు” ఇంటి పేర్లు వేరయినా అంతా ఒకే కుటుంబంలా కలిసివుండే ‘మెగా’ ఫామిలీ మధ్య కూడా ఏపీ రాజకీయాలు ప్రభావం చూపాయి. వైసీపీ ఓటమే ప్రధమ కర్తవ్యం గా టీడీపీ, బీజేపీ లతో కూటమి కట్టిన జనసేనకు అల్లు కుటుంబం నుండి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నంద్యాల వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం బన్నీ అడుగు ముందుకేయడం….ఇక ఆ తరువాత మెగా vs అల్లు అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ వార్ జరగడం పనిలోపనిగా సాగిపోయింది.
ఇక ఆ తరువాత కూడా ఎదో విధంగా ఈ టాపిక్ ఏపీ రాజకీయాలలో నడుస్తూనే ఉంది. ఒక సారి బన్నీ కి కౌంటర్లు పడితే, మరో సారి బన్నీ కౌంటర్లు వేయడం జరుగుతూ పోతున్నాయి. అయితే ఇప్పటి వరకు ‘పుష్ప vs మెగా’ ఫాన్స్ మధ్య జరుగుతున్న ఈ వివాదంలోకి మరో కొత్త పాత్ర వచ్చి చేరింది. దీనితో ఈ వివాదంలో ‘జనసేన vs బన్నీ’ ఫాన్స్ గా మారింది.
Also Read – సుబ్బారెడ్డి vs సాయి రెడ్డి…
తాజాగా ఈ వివాదంలోకి తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేరారు. మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో ప్రజల నుండి వినతి పత్రాలు అందుకునే భాగంగా బొలిశెట్టి బన్నీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ వివాదానికి రాజకీయ రంగు పూసింది. అల్లు అర్జున్ కు ఫాన్స్ ఉన్నారా? ఆ విషయం నాకు తెలియదు.
ఆయనకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారని అల్లు అర్జున్ ఉహించుకుంటున్నారేమో, ఇక్కడ ఉంది మెగా ఫాన్స్ ఒక్కటే, ఆయనకు నచ్చితేనే వస్తాను అంటూ తన స్థాయిని మించి మాట్లాడుతున్నారు, ఆయనను రమ్మని మేము ఎవరు వేడుకోవడం లేదు, ఆయన వచ్చి మద్దతు పలికిన వైసీపీ అభ్యర్థి కూడా కూటమి సునామీలో కొట్టుకుని పోయారు, ఆయన రాకపోయినా జనసేన పోటీ చేసిన 21 కి 21 నెగ్గి తన స్థాయిని పెంచుకుంది అంటూ బన్నీ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు.
Also Read – విజయశాంతి కోపం.. మరి సగటు ప్రేక్షకుడు?
అయితే బొలిశెట్టి వ్యాఖ్యలకు హర్ట్ అయిన బన్నీ అభిమానులు గతంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి బొలిశెట్టి చేసిన వ్యాక్యలను వైరల్ చేస్తున్నారు. 2017 – 18 మధ్య టీడీపీ పార్టీలో ఉన్న బొలిశెట్టి ఒక రాజకీయ వేదిక మీద పవన్ ను విమర్శిస్తూ చేసిన ప్రసంగాన్ని పోస్ట్ చేసారు. బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడానికి కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని చెప్పి ఇప్పుడు రాష్ట్రానికొచ్చి ముఖ్యమంత్రి బాబుని, లోకేష్ ని విమర్శించడం పవన్ కు ఎంత మాత్రం న్యాయం.
ఆయన టీడీపీ పార్టీతో పాటుగా ఏపీ ప్రజలను మోసం చేసాడు అంటూ పవన్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలను మళ్ళీ తవ్వి తీసి తాజాగా ప్రచారం చేస్తున్నారు బన్నీ అభిమానులు. ఇలా అల్లు vs మెగా గా మొదలైన ఈ వివాదం, ఇప్పుడు బన్నీ ఫాన్స్ vs జనసేనగా దిశ మార్చుకోబోతుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి.
ఇరు వర్గాల అభిమానుల ముసుగులో ఉన్న ప్రత్యర్థులు మొదలైన ఈ మంటలోనే చలి కాచుకుంటారన్న విషయం అటు బన్నీ ఫాన్స్, ఇటు మెగా ఫాన్స్ గమనించలేకపోవడం ఇక్కడ కోసమెరుపు. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారక ముందే జాగ్రత పడడం అటు పుష్పకు, ఇటు జనసేనకు మంచిది. ఇక్కడ పవన్ సినిమాలోని ఒక డైలాగ్ ఇరు వర్గాల వారు గమనిస్తే వివాదానికి ముగింపు దొరుకుతుంది.
“సాయ చేసిన వాడు కృతజ్ఞత ఆశించడం ఎంత తప్పో సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపకపోవడం కూడా అంటే తప్పు”. ఈ వాక్యం యొక్క పరమార్థం తెలుసుకుంటే బన్నీ ఫాన్స్ తో పాటు జనసైనికులు, మెగా అభిమానులు ఇద్దరు సోషల్ మీడియా వార్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఎవరి సినిమా ప్రపంచంలో వారు, ఎవరి రాజకీయ జీవితంలో వారు ముందుకు సాగుతారు. ‘గోటితో పోయేదానికి గొడ్డలి’ అవసరమా అనేది గమనించాలి.