సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ‘ట్రెండ్ సెట్టింగ్’ సినిమాను సృష్టించిన శ్రీకాంత్ అడ్డాల – ప్రిన్స్ మహేష్ బాబు కాంభినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో “బ్రహ్మోత్సవం” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో అందరి చూపులు ధియేటిరికల్ ట్రైలర్ పై పడ్డాయి. ఆడియో వేడుకపై ఆ ట్రైలర్ కూడా రానే వచ్చింది. మరి ట్రైలర్ దర్శనం చేసుకున్న తర్వాత ప్రిన్స్ అభిమానులు, సినీ వీక్షకుల స్పందన ఏంటి? అని పరిశీలిస్తే…
‘శ్రీమంతుడు’ సినిమాను తర్వాత ప్రిన్స్ ను చూస్తున్న అభిమానుల ఆనందానికి కొదవ లేదు. ట్రైలర్లో ప్రిన్స్ లుక్స్ కు, పేల్చిన పంచ్ డైలాగ్ లకు, బీరకాయ సుట్టాలకు ఫస్ట్ లుక్ లోనే కనెక్ట్ అయిపోయారు. అలాగే చిత్రీకరణ జరిపిన లొకేషన్స్, హీరోయిన్ల లుక్స్, ఫోటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ సంగీతం… ఇలా ట్రైలర్లోని సర్వం ప్రిన్స్ అభిమానులను ఫిదా చేసే అంశాలే. దీంతో మహేష్ ప్రకటించిన మే 20వ తేదీ ఘడియలు కోసం అభిమానుల నిరీక్షణ మొదలైనట్లే…!
ఇక, సినీ ప్రేక్షకుల విషయానికి వస్తే… ట్రైలర్ చూడగానే ఒక ‘ఫీల్ గుడ్’ సినిమాను చూడబోతున్నామన్న అనుభూతి కలగడం సహజం. ట్రైలర్ గురించి బాగా గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా… అలాగని విమర్శించడానికి కూడా శ్రీకాంత్ అడ్డాల ఎవరికీ, ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తనదైన రీతిలో ‘బ్రహ్మోత్సవం’ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్ స్పష్టం చేయడంతో సాధారణ ప్రేక్షకులు కూడా ‘బ్రహ్మోత్సవం’ కోసం వెయిట్ చేయడం ఖాయమే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ‘బ్రహ్మోత్సవం’కు సలాం కొట్టడం లాంఛనంగా కనపడుతోంది.



