సార్వత్రిక ఎన్నికలు అనే అగ్ని పరీక్షలో విఫలమై ఫామ్ హౌస్ వాసం చేస్తున్న బిఆర్ఎస్ ఇప్పుడు మరిన్ని అగ్ని పరిక్షలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమయింది. ఇందులో ముఖ్యంగా కల్వకుంట కుటుంబంలో రచ్చకెక్కిన రాజకీయ విభేదాలు ఒకటైతే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు మరొకటి.
బిఆర్ఎస్ ముఖ్య నాయకుల పై కవిత అవినీతి ఆరోపణలు ఒక పక్క, పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ మరోపక్క బిఆర్ఎస్ ను నైతికంగా కుంగదీస్తుంటే, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు బిఆర్ఎస్ ను రాజకీయంగా బలపడేలా చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ విజయం గులాబీ జెండాకు ప్రాణ వాయువైతే, కేసీఆర్ కారుకి రాజకీయంగా బులెట్ ప్రూఫ్ అవుతుంది. బిఆర్ఎస్, బీజేపీ లో విలీనం కాబోతుంది, బిఆర్ఎస్ లో కాంగ్రెస్ కోవర్టల రాజకీయమే నడుస్తుంది అంటూ కవిత బిఆర్ఎస్ ఉనికి మీదే అనుమానాలు రేకెత్తించేలా రాజకీయ ఆరోపణలు చేసారు.
ఇక అధికార కాంగ్రెస్ పార్టీ సైతం కేసీఆర్, కేటీఆర్ ల అవినీతి కి బీజేపీ రక్షణ కవచంలా నిలుస్తుందని, బీజేపీ, బిఆర్ఎస్ తెరచాటు రాజకీయాలు నడుపుతున్నారంటూ విమర్శిస్తోంది. ఇక బీజేపీ విషయానికొస్తే తెలంగాణలో బిఆర్ఎస్ గులాబీ ఎప్పుడో వాడిపోయిందని, కేసీఆర్ కారు పార్టీ ఓటమితోనే కుదేలయింది బిఆర్ఎస్ చచ్చిన పాము అంటూ గులాబీ పార్టీ అస్తిత్వాన్ని సవాల్ చేస్తున్నారు.
ఇలా బిఆర్ఎస్ పార్టీ చుట్టూ కవిత, రేవంత్, బీజేపీ లు ఆరోపణలతో, విమర్శలతో, సవాళ్లతో ముప్పేట దాడి చేస్తున్న ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ కు ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో పార్టీ గెలుపు అత్యత్న కీలకమైనది.
ఈ ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తన మునపటి హావాను కొనసాగించగలిగితే అది అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అవుతుంది. అలాగే బిఆర్ఎస్ పై ఆ పార్టీ ముఖ్య నాయకుల పై కవిత చేసిన అవినీతి ఆరోపణలకు ఎదురుదెబ్బ అవుతుంది.
ఇక ఇన్నాళ్ళుగా బిఆర్ఎస్ ఉనికిని ప్రశార్ధకంలోకి నెడుతున్న బీజేపీ రాజకీయానికి బిఆర్ఎస్ విజ్జయం గట్టి హెచ్చరిక అవుతుంది. అంటే ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టుగా ఒక్క విజయం ముగ్గురి ప్రత్యర్థుల అవినీతి ఆరోపణలకు, అక్రమాల విమర్శలకు, విలీన రాజకీయాలకు చెక్ పెట్టినట్టవుతుంది.
అలాగే బిఆర్ఎస్ భవిష్యత్ నాయకత్వం మీద కూడా పార్టీకి ఒక నమ్మకం భరోసా అందించినట్టవుతుంది. అలాకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రజామోదం పొందాక పొతే ఇక రానున్న రోజులలో బిఆర్ఎస్ అదే ముగ్గురి ప్రత్యర్థుల నుంచి మరిన్ని రాజకీయ అగ్ని పరీక్షలను ఎదుర్కోకతప్పదు.





