సమయం లేదు మిత్రమా…. జైలు, బెయిల్‌ అన్నీ ఉన్నాయిగా!

Telangana-BJP-BRS

ఒకప్పుడు పార్టీ సిద్దాంతాల పట్ల నమ్మకమున్న కార్యకర్తలలో నుంచి నాయకులు తయారయ్యేవారు. అందుకే ఇదివరకు రాజకీయ పార్టీలకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన తట్టుకొని నిలబడగలిగేవి. కానీ ఇప్పుడు ఏ పార్టీకి అంత సమయం, ఓపికా రెండూ లేవు.

ADVERTISEMENT

పైగా ఎన్నికలు వందలు, వేల కోట్ల వ్యాపారంగా మారిపోయింది. కనుక మంచి పెట్టుబడి పెట్టగలవారిని దిగుమతి చేసుకొని టికెట్లు ఇస్తున్నాయి. పెట్టుబడి పెట్టినవారు దానిపై భారీగా లాభాలు ఆశిస్తారు. కనుక తమ పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే మంత్రి పదవులో, కాంట్రాక్టులో తీసుకొని తిరిగి రాబట్టుకుంటారు.

అదే… ఆ పార్టీ ఓడిపోతే మరో క్షణం ఆలోచించకుండా అధికారంలో ఉన్నపార్టీలోకి మారిపోతుంటారు. తమ పెట్టుబడికి ప్రయోజనం, లాభం ఆశించడం సరైన వ్యాపార లక్షణమే కనుక వారిని తప్పు పట్టలేము. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులను ఆహ్వానించాల్సిన అధికార పార్టీలు, రాజకీయాలలోకి వ్యాపారులను ఆహ్వానిస్తున్నాయి. తద్వారా తాత్కాలికంగా విజయం సాధిస్తున్నాయి కానీ దీర్గకాలంలో అవే నష్టపోతున్నాయి.

దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కళ్లెదుటే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ భజన చేసిన వారందరూ ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీలలో చేరిపోతున్నారు. దీంతో కేవలం మూడు నెలల్లో బిఆర్ఎస్ పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది.

లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగిలినవారు కూడా వెళ్ళిపోవచ్చు. తద్వారా బిఆర్ఎస్ పార్టీ నష్టపోతే ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీలు లబ్ధి పొందుతున్నాయి. కానీ రేపు కాంగ్రెస్‌, బీజేపీలకు కూడా మళ్ళీ ఇదే పరిస్థితి ఎదురవకుండా ఉండదు.

మొదట ఎలాగో అలాగా అధికారంలో వస్తే చాలనుకునే పార్టీలు వాటి నేతలు, ఏపీలో జగన్‌ ప్రభుత్వంలాగా మరో 30 ఏళ్ళు మనమే ఉండాలని కోరుకొంటున్నారంటే రాజకీయాలు ఎంత లాభసాటి వ్యాపారమో అర్దం చేసుకోవచ్చు.

అందుకే రాజకీయ నేతలు ఎవరూ కూడా ఇప్పుడు కేసులకు, జైలుకి వెళ్ళడానికి భయపడటం మానేశారు. జైలుకి వెళుతుంటే తమను చూసి బెంగ పెట్టుకోవద్దని వారే ప్రజలకు ధైర్యం చెపుతున్నారు కూడా. నిబ్బరంగా జైలుకి వెళ్ళి కడిగిన ముత్యంలా తిరిగి వస్తామంటున్నారు. వస్తున్నారు కూడా.

కానీ అంత శ్రమెందుకని అనుకున్నవారు కేసులు, జైలు వరకు పోకుండా సింపుల్‌గా అధికార పార్టీలో చేరి తప్పించుకొంటున్నారు.

అంటే రాజకీయ పార్టీలన్నీ కలిసి రాజకీయ అవినీతిని ‘సిస్టమేటిక్’ చేసి దానికి నిర్ధిష్టమైన విధానాలను రూపొందించుకొని వాటితోనే కాస్త ఇబ్బంది పడుతూ, మళ్ళీ వాటి ద్వారానే రక్షణ పొందుతున్నాయన్న మాట!

కనుక దీనిని ‘ఐదేళ్ళ రాజకీయ టర్మ్ పాలసీ’గా కూడా భావించవచ్చు. గడువు ముగిసిన తర్వాత పాలసీని పొడిగించుకోవచ్చు. రద్ధు చేసుకోవచ్చు.యూనిట్ లింక్డ్ పాలసీలాగ ఇది ‘రాజకీయ లింక్డ్ పాలసీ’ గాబట్టి లాభనష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు వగైరా అన్నీ ఉంటాయి.

ఇదివరకు అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళి వచ్చినవారు, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలుకి వెళుతున్నవారు చెపుతున్నది కూడా ఇదే! ప్రజలే వారిని సరిగ్గా అర్దం చేసుకోలేక వారిని నిందిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories