ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘ఈడీ, సీబీఐలు నా కూతురు నీడని కూడా తాకలేవు’ అంటూ ప్రగల్భాలు పలికారు. కానీ ఆయన కళ్ళ ఎదుటే ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకుపోయి తిహార్ జైల్లో వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెను కేవలం విచారణకు పిలిస్తే బిఆర్ఎస్ పార్టీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు ఆమె పది రోజులుగా తిహార్ జైల్లో ఉంటే ఎవరూ కిక్కురుమనడం లేదు!
కేసీఆర్ పొలం బాట పట్టి రైతుల సమస్యల గురించి, కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలుచేయకపోవడం, బిఆర్ఎస్ పార్టీలో నేతలను ఫిరాయింపజేసుకోవడం గురించే మాట్లాడుతున్నారు తప్ప జైల్లో ఉన్న చెల్లి గురించి మాట్లాడటం లేదు.
నిజానికి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కవిత అరెస్టు గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో సానుభూతి ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారనుకుంటే, బిఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఆమె పేరు పలకకుండా జాగ్రత్త పడుతున్నారు!
గతంలో ఆమెను కేవలం విచారణకు పిలిచినప్పుడు కేసీఆర్ అండ్ కో ప్రధాని నరేంద్రమోడీని తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడేవారు. మోడీ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆయనను ఎద్దేవా చేస్తూ ఫ్లెక్సీ బ్యానర్లు కూడా పెట్టించేవారు.
బిఆర్ఎస్ సొంత మీడియాలో కూడా ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ పుంఖాను పుంఖాలుగా వార్తలు, కధనాలు వచ్చేవి. ఇప్పుడు దానిలో కూడా మోడీకి వ్యతిరేకంగా ఎటువంటి వార్త ప్రచురించడం లేదు.
ఎందుకంటే, కేంద్రంపై ఇంకా కత్తులు దూస్తే, కడిగిన ముత్యం తిహార్ జైలు నుంచి తిరిగి బయటకు రావడం ఇంకా ఆలస్యమవుతుందనేమో?
మరో విషయం ఏమిటంటే ఇదివరకు జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు మంత్రి కేటీఆర్ “ఇక్కడ మీ పంచాయితీలు పెట్టొద్దు. ఏమైనా ఉంటే ఏపీకి వెళ్ళి అక్కడే తేల్చుకోండి,” అని నిష్కర్షగా చెప్పారు. ఆనాడు కేటీఆర్ మాట్లాడిన మాటలే ఇప్పుడు కవిత కోసం బిఆర్ఎస్ పార్టీ హడావుడి చేసేందుకు అవకాశం లేకుండా చేశాయని చెప్పవచ్చు.
జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని జైల్లో పెడితే రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక విదేశాలలో కూడా నిరసనలు తెలియజేశారు. కానీ కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేస్తే ఎవరూ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆనాడు చంద్రబాబు నాయుడు కోసం నారా లోకేష్ ఢిల్లీలో మకాం వేసి జాతీయ మీడియాతో దీని గురించి మాట్లాడారు. కానీ కవిత అరెస్ట్ గురించి కనీసం తెలంగాణలో కూడా ఎవరూ మాట్లాడటం లేదు!
చంద్రబాబు నాయుడుని జైలు నుంచి విడిపించుకోవడం కోసం ఆనాడు నారా లోకేష్ సుప్రీంకోర్టు న్యాయవాదులతో ముఖాముఖీ మాట్లాడుతూ న్యాయపోరాటం చేశారు. కానీ కవిత విషయంలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు.
తండ్రి చంద్రబాబు నాయుడు కోసం నారా లోకేష్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి ప్రధాని నరేంద్రమోడీని కూడా కలిసి మాట్లాడారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్, మోడీపై కేసీఆర్ కత్తులు దూయడం రెండూ స్వయంకృతాలే కనుక ఆ అవకాశం లేకుండా చేసుకున్నారు.
కేసీఆర్ అండ్ కో ప్రస్తుతం ‘సైలంట్ మోడ్’లో ఉండిపోయి, మేము మీతో స్నేహమే కోరుకొంటున్నామని మోడీకి సంకేతాలు ఇస్తున్నట్లు భావించవచ్చు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ స్వయంగా ఇదే చెప్తారేమో?




