
మొన్నటి వరకు పంట రుణాల మాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించిన కేటీఆర్, తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో విమర్శిస్తూ సోషల్ మీడియాలో వరద నీటితో నిండుగా ప్రవహిస్తున్న మేడిగడ్డ బ్యారేజి వీడియోని పోస్ట్ చేశారు. “కాంగ్రెస్ కుట్రలన్నీ గోదాట్లో కొట్టుకుపోగా మేడిగడ్డ బ్యారేజి మాత్రం ఠీవిగా నిలబడి ఉందంటూ కవిత్వం ఒలకబోశారు.
మేడిగడ్డ బ్యారేజిలో మూడు పియర్స్ క్రుంగినప్పటికీ ప్రాజెక్ట్ దివ్యంగా ఉందని, కానీ రేవంత్ రెడ్డి తమని అప్రదిష్టపాలు జేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం దెబ్బతిందన్నట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Also Read – ప్యాలస్ లు కాదు పరిశ్రమలు కావాలి..!
దానికి తెలంగాణ కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. “మీ కాళేశ్వరరావు కమీషన్లకు కక్కుర్తితో పేకమేడలాంటి ప్రాజెక్ట్ కట్టాడు. మేడిగడ్డ బ్యారేజిలో గేట్లు మూసి నీళ్ళను నిలిపితే ప్రాజెక్ట్ కొట్టుకుపోతుంది. అందుకే ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని వచ్చింది వచ్చిన్నట్లు బయటకు వదిలేయవలసివస్తోంది.
అవన్నీ సముద్రం పాలవుతున్నాయి. తెలంగాణలో సాగు, తాగునీటి కోసం నిల్వ చేయవలసిన నీళ్ళన్నీ సముద్రం పాలువుతుంటే సన్నాసులు… సంకలు గుద్దుకుంటున్నారు,” అంటూ బదులిచ్చింది.
Also Read – వైసీపీ రాజకీయాలు మారాయి… మరి టీడీపీ?
కేసీఆర్ స్వయంగా దగ్గరుండి డిజైన్ చేయించి యావత్ ప్రపంచమే అబ్బురపడేలా మూడేళ్ళలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించానని గొప్పలు చెప్పుకునేవారు. కానీ ఆయన అధికారంలో ఉండగానే ఆ ప్రాజెక్టులో మొట్టమొదటిది, అత్యంత కీలకమైనది మేడిగడ్డ బ్యారేజిలో మూడు పిల్లర్లు క్రుంగిపోయాయి!
దానిపై కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధాలు కొనసాగిస్తే తమ పరువే పోతుందని బిఆర్ఎస్ పార్టీ కొన్ని నెలలుగా వెనక్కు తగ్గింది.
Also Read – సంక్షేమ పధకాలతోనే వైసీపీని హైజాక్.. భలే ఉందే!
ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే మేడిగడ్డ బ్యారేజి గేట్లన్నీ మూయించేయగలదు. అప్పుడు నీటి ఒత్తిడి తట్టుకోలేక మరికొన్ని పిల్లర్లు క్రుంగిపోయి ఉండేవి. అదే జరిగితే కేసీఆర్ పరువు అదే గోదాట్లో కొట్టుకుపోయి ఉండేది.
కానీ రాజకీయాల కోసం మేడిగడ్డ బ్యారేజిని దెబ్బ తీసుకుని రాష్ట్రానికి నష్టం కలిగించడం సరికాదని సిఎం రేవంత్ రెడ్డి భావించడం వలననే వరద నీటిని దిగువకు విడిచిపెట్టేసి బ్యారేజిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది గమనించకుండా వరద నీటితో మేడిగడ్డ బ్యారేజి నిండుగా ప్రవహిస్తుండటం మాత్రమే చూసి కేటీఆర్ తొందరపడి ట్వీట్ వేసి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ దొరికిపోయారు పాపం!