“ఏమిటీ అన్యాయం.. మా ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతారా?” అని ఇది వరకు కాంగ్రెస్, టిడిపిలు ఆక్రోశించేవి. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ ఆక్రోశిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే “ఆరు నెలల్లోగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని లేదా కూలిపోతుందని అప్పుడు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని,” కేటీఆర్, హరీష్ రావులు బెదిరించేవారు.
రేవంత్ ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేల బొటాబోటీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం, బిఆర్ఎస్ పార్టీకి 39, మిత్రపక్షం మజ్లీస్ పార్టీకి ఏడుగురు కలిపి 46 మంది ఎమ్మెల్యేలు ఉండటమే దీనికి కారణం అని చెప్పవచ్చు. అదే… రేవంత్ ప్రభుత్వానికి 80-90 సీట్లు, బిఆర్ఎస్ పార్టీకి 10-12 సీట్లు వచ్చి ఉండి ఉంటే కేసీఆర్‌కు ఇలాంటి ఆలోచన కూడా కలిగేది కాదు.
ఈ బెదిరింపులే రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ మంత్రులకు ఆందోళన కలిగించి ఆలోచింపజేశాయని చెప్పవచ్చు. అప్పటికీ బిఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వం జోలికి రాకపోతే, మేము కూడా మీపార్టీ జోలికి రాబోమని రేవంత్ రెడ్డి చక్కటి ప్రతిపాదన చేశారు కూడా. కానీ దానిని కేసీఆర్ అండ్ కో అలుసుగా తీసుకొని రెచ్చిపోయారు.
దాంతో రేవంత్ రెడ్డి కూడా బిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టి వారిని ఒకరొకరిగా కాంగ్రెస్ పార్టీలోకి లాగేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా తాజా భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై కేటీఆర్ ఆక్రోశిస్తూ, “నిన్ననే కదా మీ రాహుల్ గాంధీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలులోకి తెస్తామని చెప్పారు. 24 గంటలు గడవక మునుపే మా ఎమ్మెల్యేని మీ పార్టీలో చేర్చుకోవడం చూస్తే మీరు చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని స్పష్టం అవుతోంది. మా పార్టీ గుర్తు మీద గెలిచిన వారందరూ తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలి. లేకుంటే మేము వారిపై సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేయడానికి వెనకాడము,” అని హెచ్చరించారు.
తాజా చేరికలతో శాసనసభలో కాంగ్రెస్ బలం 68కి చేరగా బిఆర్ఎస్ బలం 36కి తగ్గింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మరో 10-15 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. అంటే బిఆర్ఎస్ పార్టీ దాదాపు ఖాళీ అయిపోవచ్చన్న మాట!




