తెలంగాణ సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ప్రకటించినప్పటి నుంచి ఏపీలో హడావుడి మొదలైపోయింది. బిఆర్ఎస్ ఏపీలో ప్రవేశిస్తే ఎవరికి మేలు ఎవరికి కీడు?దానితో వియ్యమా కయ్యమా? ఏది మంచిది? ఏపీలో ఎవరెవరూ దాని పంచన చేరబోతున్నారు? ఏపీ రాజకీయాలు, ఓటర్లపై దనై ప్రభావం ఏ మేరకు ఉంటుంది?వంటి అనేక కొత్త ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. వాటిపై పార్టీలలో అంతర్గతంగా, మీడియాలో బహిరంగంగా చర్చలు సాగుతున్నాయి. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళితే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న మంత్రి కేటీఆర్ ఈరోజు చెప్పిన మాటలతో కొంత స్పష్టత వచ్చింది. బిఆర్ఎస్ లక్ష్యం కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే కనుక తమ పార్టీ లోక్‌సభ సీట్లను సాధించడానికే గట్టిగా ప్రయత్నిస్తుందని చెప్పారు. తమ లక్ష్యం లోక్‌సభ ఎన్నికలు మాత్రమే అని చెప్పారు. ముందుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో పోటీ చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
కనుక ప్రస్తుతానికి బిఆర్ఎస్ శాసనసభ స్థానాలలో పోటీ చేసే ఆలోచన లేదని అర్దమవుతోంది. కనుక బిఆర్ఎస్ ఇదే మాటకు కట్టుబడి ఏపీలో అడుగుపెడితే అది 25 లోక్‌సభ స్థానాలను దక్కించుకొనేందుకు గట్టి ప్రయత్నం చేస్తుంది తప్ప శాసనసభ ఎన్నికలలో వేలుపెట్టబోదని భావించవచ్చు. ఇది టిడిపి, వైసీపీ, జనసేనలకు చాలా ఉపశమనం కలిగించే వార్తే అని చెప్పవచ్చు.
బిఆర్ఎస్ మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు దూరంగా ఏర్పడుతున్న పార్టీ కనుక ఏపీలో ప్రధాన పార్టీలు ఏవీ దాంతో దోస్తీ చేసే సాహసం ఎవరూ చేయవు. ఇక బిజెపి పాలిత రాష్ట్రాలలో దానిని వ్యతిరేకించే జనతాదళ్ (యు) కర్ణాటక, శివసేన (మహారాష్ట్ర), సమాజ్ వాదీ (ఉత్తరప్రదేశ్) వంటి పార్టీలు బిఆర్ఎస్‌తో తప్పకుండా చేతులు కలుపుతాయి కనుక వాటితో పొత్తులు పెట్టుకొని ఆయా రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాలకు పోటీ చేయవచ్చు. అలాగే బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్న బిహార్, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో పోటీ చేయవచ్చు. కానీ అక్కడి ప్రజలు బిఆర్ఎస్‌ను ఆదరించి ఓట్లు వేస్తారనే నమ్మకం లేదు.
ఇందుకు ఉదాహరణగా టిఆర్ఎస్‌కు మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ గురించి చెప్పుకోవలసి ఉంటుంది. ఆ పార్టీ యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ముస్లిం జనభా ఎక్కువగా ఉండే జిల్లాలో పాగా వేయాలనుకొంది కానీ వారూ మజ్లీస్‌ను తిరస్కరించారు. కనుక పోటీ చేసి గెలిచేందుకు అనుకూలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలపై బిఆర్ఎస్ దృష్టి పెట్టక తప్పదని స్పష్టం అవుతోంది.
మహారాష్ట్ర, కర్నాటక, రెండు తెలుగు రాష్ట్రాలతో కలిపి బిఆర్ఎస్ కనీసం 30-35 లోక్‌సభ సీట్లు గెలుచుకోగలిగితేనే దేశంలో మిగిలిన రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు దానితో చేతులు కలిపేందుకు ముందుకు వస్తాయి. లేకుంటే ఈ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కనుక ఏపీలో 25 లోక్‌సభ స్థానాలపై బిఆర్ఎస్ దృష్టి పెట్టే అవకాశం ఉంది.



