గ్యాప్ వచ్చిందా…? తీసుకున్నారా..?

KCR

తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత రాజకీయాల నుండి ఒక్కసారిగా కనుమరుగయ్యారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎం గా దశబ్దం పాటు ఏకఛత్రాధిపత్యం వహించిన కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ 2023 లో జరిగిన ఎన్నికలలో ఘోర ఓటమిని చవిచూసింది.

పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు…కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల మహిమ కావచ్చు… కారణం ఏదైనా కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఎంతటి మహా నేత అయిన ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును గౌరవించాల్సిందే అనేది కేసీఆర్ గ్రహించడానికి చాలా ఎక్కువ గ్యాపే తీసుకున్నారు.

ADVERTISEMENT

ఓటమితో ప్రజలకు ముఖం చూపించలేకనో, లేక ప్రతిపక్షాల విజయం చూడలేకనో ఓడిపోయిన తరువాత కనీసం మీడియాకు ముఖం చూపించలేదు కేసీఆర్. ఇంతలోనే అనుకోని ప్రమాదంతో బాత్ రూమ్ లో కాలు జారీ పడి కాలుకు శస్త్ర చికిత్స చూపించుకుని కొన్ని నెలలపాటు బెడ్ కె పరిమితమయ్యారు.

ఓటమి తరువాత మొదటిసారిగా తెలంగాణ ప్రజలకు ఆసుపత్రి బెడ్ మీద దర్శనమిచ్చారు కేసీఆర్. ఇలా ఆరోగ్యం కోలుకోవడానికి మరికొన్నాళ్లు రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చింది. ఒక పక్క అధికార కాంగ్రెస్ గత ప్రభుత్వం మీద అటు అసెంబ్లీ లోను ఇటు గ్రౌండ్ స్థాయిలోను నిప్పులు చెరుగుతుంటే కేసీఆర్ మాత్రం మౌనమే తన సమాధానం అన్నట్టు మిన్నకున్నారు.

బిఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి కౌంటర్లు వేస్తూ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక తీసుకున్న గ్యాప్ చాలు రాజకీయాలు మొదలుపెడదాం అనుకున్న కేసీఆర్ మేడిగడ్డ, కాళేశ్వరం ప్రోజెక్టుల పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నాయకులను తన వాగ్దాటితో కట్టడి చేసే ప్రయత్నం చేసారు.

ఈ లోపే లిక్కర్ కేసులో కూతురు కవిత అరెస్టు కేసీఆర్ ను మరోసారి కుంగతీసింది. దీనితో మరోసారి రాజకీయాల నుంచి కాస్త గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంతవరకు కవిత అరెస్టు విషయమై ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, ఒక్కరి పైన కూడా ఆరోపణ చేయలేదు. దీనికి కూడా తన మౌనమే సమాధానం అన్నారు. ఇలా కేసీఆర్ మౌనాన్ని సాకుకా చెప్పుకుని పార్టీ సీనియర్లుగా ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.

దానికి తోడు కుమారుడు కేటీఆర్ మెడకు ఫోన్ టాపింగ్ వ్యవహారం చుట్టుకోవడంతో, అటు కొడుకు, ఇటు కూతురు ఇద్దరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ ఉచ్చులో ఇరుకుంటున్న ఈ సందర్భాల్లో రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికలలో కేసీఆర్ తన పార్టీ నుండి కనీసం కొంతమంది అభ్యర్థులైనా గెలిపించుకోవడం అనివార్యంగా మారింది. దీనితో ఇక చెసెదిమి లేక తీసుకున్న గ్యాప్ కు, వచ్చిన గ్యాప్ కు సెలవిచ్చి ఇక తిరిగి రాజకీయాలను మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు.

ఈ నెల 15 న మెదక్ జిల్లాలో బిఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల శంఖారావం మోగించనున్నారు. బిఆర్ఎస్ పార్టీ నుండి మెదక్ పార్లమెంట్ స్థానానికి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ని ప్రకటించగా, కాంగ్రెస్ నుండి నీలం మధు బరిలో నిలిచారు. ఈ ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీకి జీవన్మరణ సమస్యగానే చెప్పవచ్చు. ఇప్పటికే కీలక నేతలందరూ కారు దిగి ఎవరిదారి వారు చూసుకోవడంతో ఇక మిగిలిన నేతలైన కాపాడుకోవాలి అంటే కేసీఆర్ తన అభ్యర్థులను గెలిపించుకోవడం ఒక్కటే దారి. లేకపోతె కేసీఆర్ రాజకీయ జీవితంలో చాలా పెద్ద గ్యాప్ వచ్చే ప్రమాదం లేకపోలేదు.

ADVERTISEMENT
Latest Stories