టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై అనేక కేసులు నమోదు చేసి సుమారు రెండు నెలలు జైల్లో పెట్టగలిగామని వైసీపి నేతలు సంతోషపడుతుండవచ్చు. టపాకాయలు కాల్చి మిటాయిలు పంచుకొని ఉండవచ్చు. కానీ అదే వారి కొంప ముంచబోతోందని టిడిపి ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న అన్నారు.
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి జాతకం బాగోనందునే ఆయన చంద్రబాబు నాయుడు జోలికి వచ్చి అగ్గితో చలగాటం ఆడారని అన్నారు. కనుక జగన్ ఓసారి తన జాతకాన్ని జ్యోతిష్యులకు చూపించుకొంటే మంచిదని సూచించారు. జగన్ జాతకం బాగోకపోతే వైసీపి నేతల జాతకాలు కూడా మారిపోతాయని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాయుడుపై రాజకీయకక్ష తీర్చుకొనేందుకు ఆయనను అరెస్ట్ చేయించి జగన్ చాలా దుందుడుకుగా వ్యవహరించారని వైసీపిలో సీనియర్ నేతలే అనుకొంటున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం వలన వైసీపి పట్ల ప్రజలలో వ్యతిరేకత, టిడిపి పట్ల సానుభూతి పెరుగుతుందని, దీని వలన తాము నష్టపోతామని వైసీపిలో సీనియర్లు ఆందోళన చెందుతున్నారని బుద్ధా వెంకన్న అన్నారు.
ఇదివరకు మూడుసార్లు బసు యాత్రలను వాయిదా వేయించిన జగన్‌జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ విషయం అర్దమైంది కనుకనే వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలను బస్సులు ఎక్కించి జనాల మద్యకు పంపించారని బుద్ధా వెంకన్న అన్నారు.
ఓ పక్క రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై పట్టపగలే నడిరోడ్డుపై వైసీపి గూండాలు దాడులు చేస్తుంటే వారిని అదుపు చేయని జగన్మోహన్ రెడ్డి ‘నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు’ అంటూ కపటప్రేమ ప్రదర్శిస్తుంటారని బుద్ధా వెంకన్న ఆరోపించారు.
పులివెందులలో బీటెక్ రవిని, పాలకొల్లులో నిమ్మల రామానాయుడిని ఏదో కుంటిసాకులతో అరెస్ట్ చేయిస్తుండటం ద్వారా జగన్ ప్రభుత్వం ఎంత అభద్రతాభావంతో ఉందో అర్దం చేసుకోవచ్చని బుద్ధా వెంకన్న అన్నారు.
చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడంతోనే వైసీపి ప్రభుత్వం పతనం ప్రారంభమైందని, వైసీపి పాలన ఎంత గొప్పగా ఉంటుందో ప్రజలు చూసేశారు కనుక జగన్మోహన్ రెడ్డికి రెండో ఛాన్స్ ఇవ్వరని బుద్ధా వెంకన్న అన్నారు.
జగన్ తీరుతో ప్రజలే కాదు వైసీపి నేతలు కూడా వేసారిపోయున్నారని బుద్దా వెంకన్న అన్నారు. ప్రజలకు ఎన్నికల ఆప్షన్ ఉంది కానీ వైసీపి నేతలకు జగన్ తప్ప మరో ఆప్షన్ లేదు కనుకనే జగన్ భజన చేస్తున్నారని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.
—




