ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో అధికార పార్టీ పూర్తి సమయాన్ని గత ప్రభుత్వాన్ని నింధించడానికే కేటాయించినట్టుగా కనిపిస్తుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర విభజన తర్వాత ఐటీ పరిశ్రమకు తగిన ప్రదేశంగా వైజాగ్ ఉన్నప్పటికీ.. ఆ నగరంలో ఐటీని ఉద్దేశపూర్వంగా అభివృద్ధి చేయలేదని గత ప్రభుత్వం తీరును బుగ్గన తప్పుబట్టారు. వైజాగ్‌ను అభివృద్ధి చేసే ఉద్దేశమే గత ప్రభుత్వానికి లేదన్నారు. తమకు నచ్చిన చోట ఐటీ కంపెనీలు పెట్టాలని టీడీపీవాళ్లు కోరారని, కానీ, అక్కడ తగిన వాతావరణం లేకపోవడంతో ఐటీ కంపెనీలు రాలేదన్నారు.
దీనితో ఆ రంగం కుదేలు అయ్యిందని, వైజాగ్ వెనుకపడిపోయిందని చెప్పుకొచ్చారు. 2018-19 సంవత్సరానికి రూ. వెయ్యి ఆరు కోట్లు కేటాయించినప్పటికీ దాదాపు 400 కోట్లు మాత్రమే ఐటీ కోసం ఖర్చు చేశారని, తాము రూ. 453 కోట్లు కేటాయించామని, ఇందులో తక్కువ ఏముందని బుగ్గన తమ ప్రభుత్వ కేటాయింపులను సమర్ధించుకున్నారు. ఐటీనీ తామే కనిపెట్టామని, కంప్యూటర్‌నూ, సెల్‌ఫోన్‌నూ తామే కనిపెట్టామని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారని, అంతేకాకుండా వాళ్ల ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రి కూడా చాలా ముఖ్యమైన మనిషి అని పరోక్షంగా నారా లోకేశ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.
ప్రపంచానికి టెక్నాలజీ నేనే నేర్పించానని చంద్రబాబు ఇదే సభలో గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. బుగ్గన ఆరోపణలు కాసేపు పక్కన పెడితే, ఈరోజు ఉదయం వచ్చిన మరో వార్త వివిధ విమానయాన సంస్థలు వైజాగ్ నుండి తమ సర్వీసులు తగ్గించుకుంటున్నాయి. ప్రభుత్వం కూడా అలా జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ వార్తలు సారాంశం. సరైన విమానయాన సర్వీసులు లేకుండానే విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధి జరపవచ్చు అని ప్రభుత్వం అనుకుంటుందా?



