వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రశ్నించేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మళ్ళీ నోటీస్ పంపించింది. ఈరోజు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకి కావలసిందిగా సీబీఐ నోటీస్ పంపితే 5 రోజుల తర్వాత ఎప్పుడైనా వస్తానని అవినాష్ రెడ్డి సీబీఐకి తెలియజేయడంతో ఈరోజు మళ్ళీ నోటీస్ పంపింది. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకి హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకి హాజరుకావాలని ఆదేశించింది. ఆయన కోరిన్నట్లుగానే 5 రోజులు తర్వాత విచారణకి హాజరుకావాలని నోటీస్ పంపించింది కనుక ఈసారి హాజరవక తప్పకపోవచ్చు.
వివేకా హత్య కేసుని ఏపీ నుంచి తెలంగాణకి బదిలీ చేసినందున, సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కడప జిల్లా కోర్టులో ఈ కేసుకి సంబందించిన అన్ని ఫైల్స్ కూడా తెలంగాణ హైకోర్టుకి పంపించారు. అదేవిదంగా ఈ కేసుకి సంబందించి పోలీసుల వద్ద ఉన్న ఫైల్స్ హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయానికి, ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం కడప జైలులో ఉన్న నిందితులని హైదరాబాద్‌లో జైలుకి బదిలీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం నత్తనడకన సాగిన వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ఇకపై వేగవంతం కాబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ తాజా పరిణామాలు ఏపీలో ఏ రాజకీయ పరిణామాలకి సంకేతాలో?



