ఏపీ శాసనసభ ఎన్నికల హడావుడి మొదలవక ముందు నుంచే ఈసారి వైసీపి, టిడిపి కూటమిలో ఏది గెలుస్తుందనే దానిపై చాలా జోరుగా చర్చలు సాగాయి. ఎన్నికల ప్రచారం, పోలింగ్ సరళి, పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు, వైసీపి నేతల ఆర్తనాధాలు చూసిన తర్వాత టిడిపి కూటమి గెలువబోతోందని స్పష్టమైంది.
అయితే మూడు రోజులు ఏకధాటిగా ఆక్రోశించిన వైసీపి నేతలందరూ మళ్ళీ నిన్నటి నుంచి హటాత్తుగా ‘మేమే గెలిచి అధికారంలోకి రాబోతున్నామని’ కొత్త రాగం అందుకోవడం చాలా ఆశ్చర్యం, అనుమానం కలిగిస్తోంది. ముఖ్యంగా ‘కౌంటింగ్‌లో ఏదో జరుగబోతోందన్నట్లు’ సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడటం ఈ అనుమానాన్ని మరింత బలపరుస్తోంది.
టిడిపి కూటమి ఈ కుట్రకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నప్పటికీ, అసలు ఈ ఆలోచన వైసీపిలో ఉందనే విషయం ఆయన నోటితోనే బయటపడింది. కనుక అంతవరకు స్ట్రాంగ్ రూములలో ఈవీఎంల భద్రత, ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు టిడిపి కూటమి తగు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం కనిపిస్తోంది. లేకుంటే ఈనగాచి నక్కల పాలు చేసిన్నట్లవుతుంది.
ఏపీలో పరిస్థితులు చక్కబరచడానికి కేంద్ర ఎన్నికల కమీషన్ డిజిపి, పల్నాడు జిల్లా కలెక్టర్‌తో సహా పలువురు పోలీస్ అధికారులపై వేటు వేసింది. కానీ వైసీపి కుట్రలకు యధాశక్తిన తోడ్పడుతున్న మరో వ్యక్తి ఇంకా చాలా కీలక పదవిలో ఉన్నారనే సంగతి టిడిపి కూటమి గుర్తుంచుకుని అప్రమత్తంగా ఉండక తప్పదు.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఏపీలో అల్లర్లు, హింసాకాండ చెలరేగవచ్చని కేంద్ర ఎన్నికల కమీషన్ భావించడం గమనిస్తే రాష్ట్రంలో పరిస్థితి చాలా ప్రమాదకరంగానే ఉందని స్పష్టమవుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి భద్రత పెంచి 24 మంది ఎస్‌పీజీ కమెండోలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీలో ఏదో దారుణం జరుగబోతోందని శంకిస్తోందన్న మాట!
చంద్రగిరి టిడిపి అభ్యర్ధి పులవర్తి నానిపై తిరుపతి యూనివర్సిటీ ఆవరణలో జరిగిన దాడి ఇందుకు ఓ ప్రత్యక్ష నిదర్శనంగా భావించవచ్చు. కనుక టిడిపి, జనసేన నేతలు, అభ్యర్ధులు మరింత అప్రమత్తంగా ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం చాలా అవసరమే.
అసలు ఈ ఎన్నికలే టిడిపి కూటమికి అతి పెద్ద పరీక్ష అనుకుంటే, ఎన్నికల తర్వాత ఈ దాడుల నుంచి తప్పించుకుంటూ బ్రతికి ఉండటం, కౌంటింగ్ సజావుగా, సక్రమంగా జరిగేలా చూడటం ఇంకా పెద్ద పరీక్షగా మారిందని చెప్పవచ్చు.
ఈ 5 ఏళ్ళుగా అనేక సవాళ్ళు, వేధింపులు ఎదుర్కొంటూ ఇక్కడ వరకు వచ్చిన టిడిపి కూటమి ఈ చివరి అగ్నిపరీక్షలను కూడా ధైర్యంగా, తెలివిగా ఎదుర్కొని విజయం సాధించి అధికారంలోకి రాగలరో లేదో రాబోయే రోజుల్లో అందరం చూడబోతున్నాము.




