రాజకీయ పార్టీలు, ప్రభుత్వం అన్నాక నిత్యం ఏవో సమస్యలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూనే ముందుకు సాగాలి. కానీ వాటిని అవి ఏవిదంగా ఎదుర్కొంటున్నాయి… ఎంత చురుకుగా స్పందిస్తున్నాయి? ఆ సమస్యల నుంచి అవి ఎంత త్వరగా ఏవిదంగా బయటపడ్డాయి? అనేదే చాలా కీలకం.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎప్పటిలాగే అనేక సమస్యలు స్వాగతం చెప్పాయి. వాటన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతుంటే కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
తాజాగా నకిలీ మద్యం, మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని చెప్పకతప్పదు.
గత ప్రభుత్వం 5 ఏళ్ళపాటు నకిలీ, చవుకబారు మద్యం అమ్ముతూ సామాన్య ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడిందని విమర్శించినప్పుడు, అదే పొరపాటు కూటమి ప్రభుత్వ హయంలో జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కదా? కానీ తీసుకోకపోవడంతో ఇప్పుడు వైసీపీ వేలెత్తి ప్రభుత్వాన్ని విమర్శించగలుగుతోంది.
గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో పలుమార్లు వైద్య సేవలు నిలిచిపోయేవి. అప్పుడు టీడీపి నేతలు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండేవారు. కానీ ఇప్పుడు వైసీపీ తమని విమర్శించేందుకు కూటమి ప్రభుత్వమే అవకాశం కల్పించింది.
మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ రాజకీయాలు చేయబోతోందని కూటమి ప్రభుత్వానికి ముందే తెలిసి ఉన్నప్పటికీ, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించింది. అందువల్లే సామాన్య ప్రజలు పెద్దగా పట్టించుకోని ఈ అంశాన్ని జగన్, వైసీపీ బాగా హైలైట్ చేయగలిగారు.
గతంలో వైసీపీ రంగులు వేసుకున్న టిడ్కో ఇళ్ళవద్ద టీడీపి నేతలు ఫోటోలు తీసుకొని జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తే, ఇప్పుడు వైసీపీ నేతలు ఏడాదిన్నర గడిచినా నిర్మాణ పనులు మొదలవని మెడికల్ కాలేజీ భవనాల వద్ద నిలబడి ఫోటోలు దిగి కూటమి ప్రభుత్వ మాటలకు, చేతలకు చాలా తేడా ఉందని నిరూపిస్తున్నారు.
ఇలా పోల్చి చెప్పుకుంటే ఇంకా చాలనే ఉన్నాయి. ప్రజలు చాలా ఆశలు పెట్టుకుని కూటమి పార్టీలకు అధికారం కట్టబెట్టారు. కానీ రాష్ట్రంలో వరుసపెట్టి ఇలాంటి పరిణామాలు జరుగుతుంటే, వైసీపీ వాటిని తెలివిగా వాడుకొని కూటమి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తోందని తెలిసి ఉన్నప్పటికీ మేల్కొనకపోతే ఏమవుతుంది? చరిత్ర పునరావృతమవుతుంది… అంతే!




