kcr-jagan-chandrababu-naidu-revanth-reddy

సినిమాలు, రాజకీయాలు రెండు ఒకదాని పై మరొకటి తన ప్రభావాన్ని చూపించే రంగాలే. అయితే ఇందులో ఒక్కోసారి తమ పవర్ చూపిస్తూ రాజకీయ నాయకులు పై చేయి సాధిస్తే, మరోసారి తన బలం చూపిస్తూ రాజకీయ నేతల భవితవ్యాన్ని నిర్దేశించగలరు సినీనటులు.

Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్‌ విధ్వంసానికి…

అయితే రాజకీయాలకు, సినీ ప్రపంచానికి విడతీయలేని అనుబంధం ఏర్పడింది మాత్రం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంతోనే. అయితే అదే సినీ చరిష్మాను కొనసాగిస్తూ నారా చంద్రబాబు కూడా టీడీపీ పార్టీ తరుపున, టీడీపీ ప్రభుత్వం చాటున సినీ రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేసారు.

దీనితో నందమూరి కుటుంబంతో పాటుగా దగ్గుపాటి కుటుంబం, మోహన్ బాబు, జయప్రద, మురళి మోహన్, రాఘవేంద్ర రావు, అశ్విని దత్, కైకాల సత్యనారాయణ, శారదా, బాబు మోహన్, రోజా వంటి అనేకమంది సినీ సెలబ్రేటిస్ టీడీపీ పార్టీ కి జై కొట్టారు. ప్రస్తుత యువ హీరోగా ఉన్న నిఖిల్ కూడా టీడీపీ జెండా మోశారు.

Also Read – వైసీపీ గొంతులో విశాఖ ఉక్కు దిగిందిగా!

ముఖ్యమంత్రిగా బాబు కూడా సినీ పెద్దలు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారం, తోడ్పాటు అందిస్తూ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య మంచి ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి తెలుగు సినీ పరిశ్రమను “ఆకట్టుకున్నారు”. దీనితో టీడీపీ గవర్నమెంట్ సినీ పరిశ్రమకు అత్యంత సానుకూల ప్రభుత్వంగా టాలీవుడ్ అంతటా గట్టి నమ్మకం ఏర్పడింది.

అయితే ఆ తరువాత సినీ పరిశ్రమ నుంచి మెగా స్టార్ చిరంజీవి వంటి సూపర్ స్టార్ ‘ప్రజారాజ్యం’తో రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికీ సినీ పరిశ్రమ నుంచి ఆశించినంత సానుకూల స్పందన కరువయ్యింది. అలాగే వైస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో కూడా సినీ పరిశ్రమ నుంచి కాంగ్రెస్ కు మద్దతుగా కృష్ణ ఆయన సోదరుడు తప్ప మరెవరు ముందుకు రాలేదు.

Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!

ఇక రాష్ట్ర విభజనతో ఏపీ, తెలంగాణగా మారిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలుగు సినీ రంగాన్ని రెండు రాష్ట్రాలకు విస్తరించలేకపోయింది. తెలంగాణలోని హైద్రాబాద్ లో స్థిరపడ్డ టాలీవుడ్, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పక్క చూపులు చూసే అవకాశాన్ని, ఆసక్తిని కోల్పోయింది. ఒక తెలంగాణ వాదిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ ను కాదని అడుగు ముందుకు వేసే సాహసం చేయలేకపోయారు టాలీవుడ్ పెద్దలు.

తన అధికారంతో, ప్రజలు తనకిచ్చిన అవకాశంతో కేసీఆర్ కూడా సినీ రంగానికి అవసరమైన మేరకు భయాన్ని, అవకాశం కుదిరినంతా చేయూతను అందిస్తూ టాలీవుడ్ ను తన వైపు “రాబట్టుకున్నారు”. ఇక 2019 ఏపీ ఎన్నికలలో విజయాన్ని అందుకున్న వైస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం రంగుల ప్రపంచమైన సినీ పరిశ్రమకు కూడా తన పార్టీ రంగులు అద్దాలని భావించి భంగపడ్డారు.

అలాగే సినీ రంగానికే చెందిన పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ పాలిట యమగండంగా తయారవడానికి తోడు, సినీ పరిశ్రమ నుంచి తనకు, తన పార్టీకి ఆశించిన మద్దతు దక్కకపోవడంతో తనకలవాటైన బెదిరింపులకు తెరలేపారు జగన్. టాలీవుడ్ పెద్దన్నగా చెప్పుకునే చిరుని మొదలు, పాన్ ఇండియా హిట్స్ అందుకున్న టాలీవుడ్ సెలబ్రేటిస్ ను సైతం తన ముందు చేతులు జోడించేలా చేసుకుని తన అహాన్ని చల్లార్చుకుని ముఖ్యమంత్రిగా టాలీవుడ్ పెద్దలను అవమానించి పంపించారు జగన్.

ఎంతోమందిని తమ టాలెంట్ తో ప్రభావితం చేయగలిగిన సూపర్ స్టార్స్ సైతం జగన్ పేరు విన్నా, వైసీపీ ప్రభుత్వ విధానాలు చూసిన భయపడే స్థాయికి వచ్చారు. తన అహంకారంతో, తన ప్రభుత్వ విధానాలతో సినీ పరిశ్రమను దూరం చేసుకుని, భయపెట్టి బెదిరించి సెలబ్రేటిస్ లను “పోగొట్టుకున్నారు” జగన్.

ఇక 2023 లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్, ప్రభుత్వాన్ని స్థాపించి దాదాపు ఏడాది పూర్తి చేసుకోబోతున్నా ఇంకా టాలీవుడ్ నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ కు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఆశించిన స్థాయిలో ఒక బంధం ఏర్పడలేదనే చెప్పాలి. అలాగే అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూడా రేవంత్ తీసుకున్న హైడ్రా నిర్ణయంతో కుప్పకూలడంతో సినీ పరిశ్రమలోని ఒక వర్గం కాంగ్రెస్ ప్రభుత్వం పై గుర్రుగా ఉంది.

దానికి తోడు అక్కినేని నాగ చైతన్య, సమంతల వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి నాగార్జున, కేటీఆర్ ల మీద మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాయి. దీనితో టాలీవుడ్ సెలబ్రేటిస్ అందరు ఒక్కసారిగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఏకకంఠంతో ఖండించారు. దీనితో తెలుగు సినీ పరిశ్రమకు, రేవంత్ సర్కార్ కు మధ్య దూరం ఇంకాస్త పెరిగిదనే చెప్పాలి.




చూడాలి మరి రేవంత్ తన రాజకీయ గురువైన బాబు గారిలా సినీ పరిశ్రమను రానున్న రోజులలో తనకు అనుకూలంగా ఆకట్టుకుంటారా.? లేక తన రాజకీయ ప్రత్యర్థి అయినా కేసీఆర్ మాదిరి తన పార్టీ వైపు రాబట్టుకుంటారా.? లేక తన సామజిక వర్గానికి చెందిన జగన్ రెడ్డి లెక్క అన్ని రకాలుగా పోగొట్టుకుంటారా.?