నారా చంద్రబాబు నాయుడు అనే నేను…అంటూ 1995 సెప్టెంబర్ 1 న తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాబు ప్రమాణ స్వీకారం చేసారు. దీనితో బాబు ముఖ్యమంత్రి ప్రస్థానం మొదలయ్యి నేటికీ మూడు దశాబ్దాలు పూర్తయ్యాయి. అలాగే టీడీపీ నాయకత్వ బాధ్యతలు బాబు చేతికొచ్చి 30 ఏళ్ళు నిండాయి.
ఈ 30 ఏళ్ళ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అలుపెరుగని రాజకీయ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు చేసిన చంద్రబాబు ఒక హైటెక్ సీఎం గా, విజనరీ నాయకుడిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వం కింద ఎంతో మంది రాష్ట్ర నాయకులుగా ఎదిగి ఇప్పటికి అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో వివిధ పార్టీలలో ముఖ్య స్థానాలలో కొనసాగుతున్నారు.
అందులో తెలంగాణ సీఎం రేవంత్ ఒకరుకాగా, మాజీ సీఎం కేసీఆర్ మరొకరు. ఇక బిఆర్ఎస్ పార్టీలో ముఖ్యనాయకులుగా చక్రం తిప్పిన తలసాని, కాసాని, మల్లా రెడ్డి, అరికపాటి గాంధీ, రావుల…ఇలా చెప్పుకుంటుపోతే అనేకమంది నాయకులు బాబు నాయకత్వం కింద పనిచేసినవాళ్ళే. ఇప్పుడు వారు తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో తమ రాజకీయాన్ని కొనసాగిస్తున్నవారే కావడం విశేషం.
ఇక ఏపీలో సైతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన కొడాలి, రోజా తో పాటు వైసీపీ తీర్ధం పుచ్చుకున్న వల్లభనేని వంటి నాయకులు సైతం ఒకప్పుడు బాబు నాయకత్వం కింద పని చేసిన టీడీపీ సైనికులే. ఇలా బాబు ముఖ్యమంత్రి ప్రస్థానం ఆయన జీవితంలో ఎన్నో మైలురాళ్లను తీసుకొచ్చింది, మరెన్నో చరిత్ర చెప్పుకునే పాఠాలను, చెరపలేని జ్ఞాపకాలను మిగిల్చింది.
1995 సెప్టెంబర్ 1 న తొలిసారిగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన బాబు ఎన్టీఆర్ నుంచి టీడీపీ పగ్గాలను చేపట్టారు. అలాగే ఆ తరువాత 1999 సార్వత్రిక ఎన్నికలలో కూడా టీడీపీ ని అధికారంలోకి తేవడంతో పాటు రెండవసారి ముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టారు. దీనితో నాటి పార్టీ పగ్గాల నిర్ణయానికి కూడా ఇటు ప్రజామోదం పొందినట్టయ్యింది.
దానితో రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్న చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మాణంతో ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని, హైద్రాబాద్ భవిష్యత్ ని మార్చేశారు. ఆ 9 ఏళ్ళలోనే రాళ్ల గుట్టలతో నిండిపోయిన హైద్రాబాద్ నగరాన్ని ఐటీ హబ్ గా తీర్చి దిద్ది సైబరాబాద్ నిర్మాణాన్ని చేపట్టారు. దీనితో బాబు విజనరీ ఏ స్థాయి అభివృద్దిని సాధిస్తుందో దేశమంతా గుర్తించింది.
దానికి తోడు నాటి అగ్రరాజ్య అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను హైద్రాబాద్ కు రప్పించిన ఘనత కూడా సీఎంగా బాబు సాధించిన రికార్డులో ఒక భాగమయ్యింది. అలాగే డ్వాక్రా, దీపం పథకం, రైతు బజార్లు, జన్మభూమి, ప్రజల వద్దకే పాలన, ఈ – గవర్నెన్స్ ఇప్పుడు తాజాగా పీ-4 వంటి కార్యక్రమాలతో పాలనలో కూడా తనదైన మార్క్ చూపించారు బాబు.
నాడు సైబరాబాద్ తన విజనరీకి అద్దం పడితే నేడు అమరావతి బాబు విజనరీకి సవాల్ గా నిలుస్తుంది. 2014 రాష్ట్ర విభజనతో ఏపీ తొలి సీఎంగా బాబు పునాది వేసిన అమరావతి ఎన్నో రాజకీయ అరాచకాలను తట్టుకుని తిరిగి 2024 లో మరల జీవం పోసుకుంది. 2029 నాటికి ఏపీ రాజధానిగా అమరావతికి దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవం తేవడంతో పాటుగా రాష్ట్రానికి రాజధాని అనే కలను పూర్తి చేయాలన్నదే బాబు లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
1995 లో ముఖ్యమంత్రిగా మొదలైన ఈ 30 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నెనో రాజకీయ తడబాట్లు, పొత్తులు, ఎత్తులు, ఒత్తిళ్లు…కలిసి నాలుగు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాబు ప్రస్థానం నిర్వీరామం గా కొనసాగుతుంది.




