టిడిపి, జనసేన, బీజేపీల కూటమి ‘నభూతో న భవిష్యత్’ అన్నట్లు భారీ మెజార్టీతో ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. అసలు కధ అక్కడి నుంచే మొదలవుతుంది.
రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఓ రకమైన సమస్యలు చంద్రబాబు నాయుడు కోసం సిద్దంగా ఉండేవి. ఈసారి అందుకు పూర్తి భిన్నమైన సమస్యలు, సవాళ్ళు ఆయన కోసం ఎదురుచూస్తున్నాయి. వాటి గురించి క్లుప్తంగా చెప్పుకుంటే…
· టిడిపి, జనసేన, బీజేపీలకు మంత్రి పదవులు పంపిణీ.
· పదవుల పంపిణీలో భాగంగానే టిడిపిలో టికెట్ దక్కని పలువురు సీనియర్లకు సముచిత పదవులు, ప్రాధాన్యత కల్పించడం.
· ప్రభుత్వంలో మూడు పార్టీలు దేనిదారి దానిదన్నట్లు కాకుండా పూర్తి సమన్వయంతో ఒకే లక్ష్యంగా పనిచేసేలా చేయడం.
· ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలుచేయడం కోసం నిధులు సమకూర్చుకోవడం.
· నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలుచేయడం.
· రాజకీయ ఒత్తిళ్ళకు లొంగకుండా సమర్ధులైన అధికారులను ఎంపిక చేసుకొని పరిపాలనను, ప్రభుత్వాన్ని గాడిన పెట్టుకోవడం.
· అప్పుల భారంతో కుప్పకూలిపోయేలా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దడం.
· అమరావతి రాజధానిగా ఏర్పడకుండా జగన్ సృష్టించిన అవరోధాలన్నిటినీ గుర్తించి, తొలగించుకొని, ఐదేళ్ళుగా నిర్మాణ పనులను నిలిపివేయడం వలన నిర్మాణాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, పెరిగిన అంచనాలకు అనుగుణంగా నిధులు సమకూర్చుకొని మళ్ళీ నిర్మాణ పనులు మొదలుపెట్టడం. వచ్చే ఎన్నికలలోగా అమరావతికి రూపురేఖలు ఏర్పడేలా చేయడం.
· నత్తనడకలు నడుస్తున్న పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేయడం.
· ఐదేళ్ళుగా నష్టపోయిన అమరావతి రైతులను ఆదుకోవడం.
· ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను చూసి భయపడుతున్న పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలకు మళ్ళీ నమ్మకం కల్పించి వీలైనంత వేగంగా రాష్ట్రానికి రప్పించడం. వాటితో యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించడం.
· ఈసారి కేంద్ర ప్రభుత్వ మనుగడకు టిడిపి, జనసేన ఎంపీల మద్దతు కీలకంగా మారింది కనుక కేంద్రంతో సఖ్యతగా ఉంటూ, సహకరిస్తూ రాష్ట్రానికి పెండింగ్ నిధులు, ప్రాజెక్టులు సాధించుకోవడం.
· జగన్ ప్రభుత్వ 5 ఏళ్ళ పాలనలో భ్రష్టుపట్టించేసిన వ్యవస్థలను, శాఖలను సమూలంగా ప్రక్షాళన చేసి చక్కదిద్దుకోవడం.
· జగన్ హయాంలో జరిగిన అవినీతి, దోపిడీ, అప్పులు, తాకట్టు పెట్టిన ప్రభుత్వాస్తులను గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపట్టడం.
· ఐదేళ్ళ జగన్ పాలనలో టిడిపి, జనసేన నేతలు అనుభవించిన కక్ష సాధింపులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టడం.






