రాష్ట్రంలో ‘నీరు – చెట్టు’ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకు వెళ్లాల్సి వుందని, ఇందుకు ప్రతి కార్యకర్త సహకరించాలని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ సందర్భంగా జల సంరక్షణ, చెట్ల పెంపకంపై ‘నాలుగు మంచి మాటలు’ చెప్తూ మహానాడుకు వచ్చిన కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. “ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఓ మొక్క నాటాలని, ఎవరైనా చనిపోతే కూడా వారి జ్ఞాపకార్థం కూడా ఓ మొక్క నాటి దాన్ని సంరక్షించుకోవాలని” పిలుపునిచ్చారు.
ఇక, తెలుగుదేశం పార్టీ నేతల్లో చాలా మంది ఫోటోలు తీయించుకునేందుకు చెట్లను నాటుతూ, ఆపై వాటిని గురించి పట్టించుకోవడం లేదని తనకు తెలిసిందని, ఇకపై అలా జరిగితే చూస్తూ ఊరుకోబోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరికలు జారీ చేసారు. నాటే ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయించనున్నానని, దాని ద్వారా ప్రతి ఆరు నెలలకూ చెట్ల చిత్రాలను తెప్పించి వాటిని పరిశీలిస్తుంటానని వెల్లడించారు. దీంతో తామంతా అప్రమత్తమవ్వాల్సిన తరుణం ఆసన్నమైందని నేతలు చర్చించుకోవడం విశేషం.



