“నేను యువకుడిని మరో 20-30 ఏళ్ళు రాజకీయాలలో ఉంటా. చంద్రబాబు నాయుడుకి వయసైపోయింది. మావిగన్ అంటే బీపీ పెరిగి గుండాగి చనిపోతారు. ఆయన రాజకీయ జీవితం చివరి దశకు చేరింది. ఇంక కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేయాల్సిందే,” అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తరచూ చెపుతుండటం అందరూ వినే ఉంటారు.
కానీ నేను యువకుడిని అని చెప్పుకునే జగన్ నేడు యోగా దినోత్సవం రోజున ఎక్కడున్నారు? 76 ఏళ్ళ వయసున్న సిఎం చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారు? అని చూస్తే ఇద్దరి మద్య వ్యత్యాసం అర్ధమవుతుంది.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు శనివారం యోగా గురు బాబా రాందేవ్‌తో కలిసి ఉండవల్లి గుహల వద్ద యోగాసనాలు వేశారు.
బాబా రాందేవ్, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత యోగాసనాలు వేయడంలో పెద్ద విచిత్రం కాదు. కానీ ఈ వయసులో కూడా సిఎం చంద్రబాబు నాయుడు వారితో పోటీ పడుతూ పలు క్లిష్టమైన యోగాసనాలు వేసి అందరినీ అబ్బురపరిచారు. బాబా రాందేవ్ సైతం సిఎం చంద్రబాబు నాయుడుని ప్రశంశించకుండా ఉండలేకపోయారు.
ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు ఒక చక్కటి మాట కూడా చెప్పారు. రాష్ట్రం, సమాజం అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానం ఎంత అవసరమో, మనుషుల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కొరకు ఆధ్యాత్మిక చింతన, యోగా కూడా అంతే అవసరమన్నారు. ఈవిషయం ఎంత మంది చెవికెక్కించుకున్నారో తెలీదు.
మరి నవ యువకుడు జగన్ కూడా యోగాదినోత్సవం రోజున యోగాసనాలు వేసి ఉంటే వైసీపీ శ్రేణులు, వారి సొంత, సోషల్ మీడియాకు తమ అధినేత గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం లభించేది. కానీ జగన్ వారికావకాశం ఇవ్వలేదు.
‘యోగా చేయడం వలన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని, యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టుతో సరి పెట్టారు.
టెక్నాలజీ విషయంలో సిఎం చంద్రబాబు నాయుడుని అందుకోలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి, కనీసం నాలుగు యోగాసనాలు వేసి ఆయనతో పోటీ పడగలనని నిరూపించుకుంటే వైసీపీ శ్రేణులు సంతోషించి ఉండేవి కదా?




