పవన్ కళ్యాణ్‌ ఎంత ఆవేశపడినా…

Pawan Kalyan speaking on caste politics

లౌకికవాదులమని చెప్పుకునే పార్టీలు, నేతలు కూడా తెలంగాణలో మత రాజకీయాలు, ఆంధ్రాలో కుల రాజకీయాలు చేస్తుంటారు. వీటికి కట్టుబడే ఎన్నికల రాజకీయాలు సాగుతుంటాయి. కాదంటే గెలిచి అధికారంలోకి రావడం చాలా కష్టం.

డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ శనివారం కాకినాడలో జరిగిన ‘మాట మంతీ’ కార్యక్రమంలో ఈ కుల పిచ్చి వదిలితే తప్ప ఆంధ్రా బాగుపడలేదని ఆవేశ పడ్డారు. ప్రతీ మనిషిని, ప్రతీ పార్టీని, ప్రతీ పనిని కులంతో ముడిపెట్టి చూసే దురలవాటు మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి కోరుకుతుంటారు తప్ప కులాలు కాదన్నారు. తాను కులాల మద్య ఐక్యత సాధించాలని ప్రయత్నిస్తుంటే తనని కాపు కులానికి ప్రతినిధిగా చూస్తుండటం చాలా బాధ కలిగిస్తోందని డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ అన్నారు.

ADVERTISEMENT

కొన్ని పాఠాలు, ప్రసంగాలు, పదాలు చాలా అర్ధవంతమైనవే కావచ్చు. కానీ రాజకీయ పార్టీలు, సమాజం కలిసి వాటిని అర్ధరహితంగా మార్చేస్తుంటాయి.

ఉదాహరణకు “భారతదేశం నా మాతృభూమి. భారతీయులు అందరూ నా సహోదరులు…’ పాఠ్య పుస్తకాలలో మొదటి పేజీలో చిన్నప్పుడు చదువుకున్న ప్రతిజ్ఞ పెద్దయ్యాక ఎవరికీ గుర్తుండదు. పట్టించుకోరు.

ఒకవేళ ఆ ప్రతిజ్ఞని ఆకళింపు చేసుకొని ఉండి ఉంటే, నేడు తెలంగాణవాదం పేరుతో అక్కడి పార్టీల నాయకులు ఆంధ్రా పట్ల ఇంత ద్వేషం ప్రదర్శించేవారు కాదు కదా? దేశ, రాష్ట్ర ప్రజల మద్య ఇంత కులమత విద్వేషాలు ఉండేవే కావు కదా?

కొన్ని రాజకీయ పార్టీలు వాటి నాయకులు ఆ విద్వేషాలని పెంచి పోషిస్తూ రాజకీయంగా ఎదుగుతుంటారు. కనుక పవన్ కళ్యాణ్‌ వంటివారు ఎంతగా ఆవేశపడినా రాజకీయ పార్టీలు, వాటి నాయకుల ధోరణి మారదు. కనుక సమాజం కూడా ఆ కోణంలో నుంచే అన్నిటినీ చూస్తుంటుంది. స్పందిస్తుంటుంది.

కానీ నేటి యువత ఈ కులమతాలకు అతీతంగా ఆలోచిస్తుంటారు. కులమతాలకు అతీతంగా కలిసి మెలిసి పని చేస్తుంటారు. కనుక పవన్ కళ్యాణ్‌ కోరుకున్న ఈ మార్పు ఈ యువతరం వల్లనే సాధ్యపడుతుంది. కానీ వారు రాజకీయాలలోకి వచ్చేందుకు ఆసక్తి చూపరు. కనీసం తాము ఆశిస్తున్న మార్పు కోసం తమ ఓటు హక్కు వినియోగించుకునే వారు ఎందరు?

ADVERTISEMENT
Latest Stories