ఓ రాజకీయ పార్టీ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవిధంగా పార్టీని ముందుండి నడిపించాలో టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు చూపారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏవిధంగా పాలన, అభివృద్ధి చేయాలో చేసి చూపిస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలు, కార్యకర్తల మద్య ఉంటూ రాజకీయ నాయకులు ఏవిధంగా ఉండాలో ఆచరణలో చూపిస్తున్నారు.
అందరితో పేచీలు పెట్టుకొని తాము నష్టపోయి, పార్టీలకు, రాష్ట్రాలకు నష్టం కలిగించుకున్న రాజకీయ నాయకులను చూశాం. చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి అలా తప్పటడుగు వేసి నష్టపోయారు. కానీ చాలా మందిలా భేషజానికి పోకుండా ఓ మెట్టు దిగి అందరినీ కలుపుకుపోతూ తాను గెలిచి తనతో ఉన్నవారందరినీ కూడా గెలిపించుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఏవిధంగా ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయో ఆచరణలో నిరూపించి చూపుతున్నారు.
బాధ్యతలకి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి వయసు అవరోధం కాదని నిరూపించి చూపిస్తున్నారు. దేశంలో నేటికీ కొంత మంది ముఖ్యమంత్రులకు, వివిధ రాష్ట్రాలలో అనేక మంది మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు కనీసం మొబైల్ ఫోన్లు వాడటం కూడా చాత కాదు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళ క్రితమే సాఫ్ట్‌వేర్ వరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏఐ, క్వాంటం కంప్యూటర్ల వరకు వెళ్ళిపోయారు.
పరిశ్రమలు, ఐటి కంపెనీలు, మౌలిక వసతుల కల్పనతో దేశ రాష్ట్ర భవిష్యత్ ముడి పడుందని గట్టిగా నమ్మే సిఎం చంద్రబాబు నాయుడు రెండోసారి అధికారం చేపట్టాక కేవలం రెండేళ్ళలోగా లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు, సీ పోర్టులు, ఎయిర్ పోర్టులు ఏపీకి తెస్తున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వయసు 76 ఏళ్ళు. కానీ మరో ముప్పై ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో, దేశంలో యువ జనాభా సంఖ్య తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉందంటూ, ఎక్కువ మంది పిల్లలని కనమని చెపుతుంటారు. అందుకోసం ఈ వయసులో రాష్ట్రంలో ‘ఫెర్టిలిటీ శాతం’ లెక్కలు అడుగుతున్నారంటే ఆయన ఎంత దూరదృష్టితో ఆలోచిస్తారో అర్థం చేసుకోవచ్చు. దేశంలో యువ ముఖ్యమంత్రులు కూడా ఇంత దూరం ఆలోచించలేరని చెప్పక తప్పదు.
ఇన్ని విధాలుగా రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో కూడా ఆదర్శంగా నిలుస్తుండటం మరో విశేషం. తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ చంద్రబాబు నాయుడు వయసులో నాలుగేళ్ళు చిన్న. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో చురుకుగా రాజకీయాలలో పాల్గొనలేకపోతున్నారు. ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సిఎం చంద్రబాబు నాయుడు కంటే 22 ఏళ్ళు చిన్న. కానీ తరచూ అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు.
తాజా అనారోగ్యం, దాని కోసం శస్త్ర చికిత్స చేసుకోవాల్సి రావడం ఇందుకు ఉదాహరణ. ఆయనని 76 ఏళ్ళ యువకుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అంటే ఆరోగ్యం విషయంలో కూడా సిఎం చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్న మాట!
కేసీఆర్, జగన్ వంటివారు దూరపుకొ౦డలు నునుపు చూస్తుంటారు. కానీ పక్కనే ఉన్న సిఎం చంద్రబాబు నాయుడుని చూడాలనుకోరు. కనుక ఏమీ నేర్చుకోవాలనుకోరు. ఎందుకంటే అహం అడ్డొస్తుంది. కానీ అహం పక్కన పెట్టి సిఎం చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకుంటే వారికి, వారి పార్టీలకు, వారి రాష్ట్రాలకు కూడా మేలే తప్ప కీడు జరుగదని ఎప్పటికైనా తెలుసుకుంటారో లేదో?




