కొన్ని సందర్భాలలో ప్రభుత్వాల, ముఖ్యమంత్రుల పనితీరుని పోల్చి చూడకుండా ఉండలేము. నిజానికి అన్ని రాజకీయ పార్టీలు నిత్యం ప్రత్యర్ధి పార్టీల కంటే మేమే బెటర్ అని పోల్చి చెప్పుకొంటూనే ఉంటాయి.
గతంలో ఉత్తరాంద్రలో హూద్ హూద్ పెను తుఫాను విధ్వంసం సృష్టితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దారిలో అనేక అవరోధాలను అధిగమిస్తూ హుటాహుటిన విశాఖకు వచ్చి అక్కడే పదిరోజులు మకాం వేసి అవసరమైన సహాయచర్యలు చేపట్టి, అన్నీ గాడిన పెట్టిన తర్వాత తిరిగి అమరావతికి వెళ్ళారు. ఒకవేళ ఆనాడు చంద్రబాబు నాయుడు స్వయంగా పూనుకోకపోయి ఉంటే ఉత్తరాంద్ర జిల్లాలు గాడిన పడేందుకు కనీసం ఆరేడు నెలలు పట్టేదని ఉత్తరాంద్ర ప్రజలు చెప్పుకొన్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
అదే… చంద్రబాబు నాయుడుని ముసలోడని ఎద్దేవా చేసే మన యువ ముఖ్యమంత్రి జగన్, రాష్ట్రంలో ఇంత పంట నష్టం జరిగినా ఇంతవరకు రైతులను పరామర్శించి ధైర్యం చెప్పడం సంగతి అటుంచి ఇంతవరకు కనీసం ఏరియల్ సర్వే చేయలేదు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమావేశమయ్యి నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి సరిపెట్టారు. సంక్షేమ పధకాలకు బటన్ నొక్కుడు సభలకు కార్లు, హెలికాఫ్టర్లు వేసుకొని వెళ్ళే సిఎం జగన్‌కి, పంటనష్టపోయిన రైతులను పరామర్శించేందుకు తీరిక, ఆసక్తి లేవా అని టిడిపి, జనసేనలు ప్రశ్నిస్తున్నాయి.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే కోనసీమ జిల్లాలో పర్యటించి రైతులను పరామర్శించి ధైర్యం చెపుతున్నారు. పంటనష్టం గురించి అడిగితెలుసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నష్టపరిహారం అందేలా చేస్తామని భరోసా ఇస్తున్నారు. నష్టపోయిన రైతులకు అండగా నిలబడాలని, యధాశక్తిన వారికి సాయం అందించాలని చంద్రబాబు నాయుడు స్థానిక టిడిపి నేతలను ఆదేశించారు.
రైతు సమస్యలన్నిటినీ గుర్తించి, రికార్డ్ చేస్తున్నామని, తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో వాటన్నిటికీ పరిష్కారాలను పేర్కొంటామని హామీ ఇచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు శాశ్విత పరిష్కారంగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఎక్కడికక్కడ ధాన్యం నిలువచేసేందుకు గోదాములు నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
ఆ తర్వాత రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించి, “రాష్ట్రానికి మళ్ళీ భారీ వర్ష సూచన వచ్చింది కనుక ఆలోగా అంటే మే 9లోగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలి. దీని కోసం టిడిపి నేతలు అధికారులకు అన్నివిదాల సహకరించేందుకు సిద్దంగా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తక్షణం క్షేత్ర స్థాయిలో పర్యటించి పంటలు, పంట నష్టం పరిస్థితి అంచనావేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాము. మూడు రోజులలోగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేయపట్టకపోతే ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ఉద్యమిస్తాం. ఈ నెల 13వ తేదీ తర్వాత ఉభయగోదావరి జిల్లాలలో ఏదో ఓ చోట నేనే స్వయంగా నిరసన దీక్ష చేయవలసివస్తుంది. కనుక ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుందో లేదో తేల్చుకోవాలి,” అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.



