ఐదు రోజుల చైనా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకుని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తదితరులతో చర్చలు జరిపిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీకే సిద్ధపడినట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీకి ‘ప్రత్యేక హోదా’తో పాటు ‘ప్రత్యేక ప్యాకేజీ’ ఇవ్వాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి వినిపిస్తున్నదే.
ఇదే విషయంపై ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. అయితే చంద్రబాబు ఆశించిన మేరకు ఇప్పటివరకు కేంద్రం స్పందించిన దాఖలాలు కనిపించలేదు. దీంతో చైనా పర్యటన నుంచి నేరుగా ఏపీకి రాకుండా ఆయన ఢిల్లీలోనే ల్యాండ్ అయిన చంద్రబాబు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ… రెండూ ఇవ్వండి, లేదంటే వాటిలో ఏదో ఒక దానిని వెంటనే ఇవ్వండి, అసలు ఏమిస్తారో తేల్చండి” అంటూ కేంద్రాన్ని అడిగినట్లుగా సమాచారం.
ఢిల్లీలో జరిగిన ఈ చర్చల అనంతరం విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టీడీపీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందజేసి, దుశ్శాలువతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు బిజీ గురించి కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏకరువు పెట్టారు. తన కొడుకు దేవాన్ష్ తన తండ్రిని చూసి… కొత్త వ్యక్తిని చూసినట్లు ఏడుస్తున్నాడని… తెల్లవారుజామునే నిద్ర లేచి కార్యాలయానికి వెళ్లి, మళ్ళీ అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ఇంటికి రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసారు.



