ఏపీలో బిజెపి-జనసేన, టిడిపి-జనసేన పొత్తులపై నేటికీ ఎటువంటి స్పష్టత రాలేదు. జనసేన బిజెపి కలిసే ఉన్నాయని రెండు పార్టీలు చెప్పుకొంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రెండు పార్టీలు ఏనాడూ కలిసి పనిచేయలేదు. అలాంటి ఆలోచనలు చేయడం లేదు కూడా. కనుక ఎన్నికలలో కూడా అవి కలిసి పనిచేస్తాయనే నమ్మకం లేదు.
పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి బిజెపి పెద్దలను కలిసి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి భేటీ అవడంతో ఆయన టిడిపితో పొత్తులకే మొగ్గు చూపుతున్నారనే విషయం స్పష్టం అయ్యింది. అలాగని టిడిపి, జనసేనలు పొత్తులపై ప్రకటన చేసేందుకు తొందరపడటం లేదు. ఇదే వైసీపీకి మింగుడుపడటం లేదు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భేటీ అయినప్పుడల్లా మంత్రులు వారిని తిట్టిపోస్తుండటం గమనిస్తే పొత్తుల విషయంలో టిడిపి, జనసేనల కంటే వైసీపీయే ఎక్కువ ఆందోళన చెందుతోందని అర్దం అవుతోంది.
మొన్న పవన్ కళ్యాణ్-చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత పొత్తులపై వారు ఏదైనా ప్రకటన చేస్తారేమో అని వైసీపీతో సహా అందరూ ఎదురుచూశారు. కానీ ప్రకటించలేదు. వారిద్దరూ కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారని, ఫలితాలను బట్టి జనసేన బిజెపితో పొత్తు కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకొనే అవకాశం కనిపిస్తోంది.
ఒకవేళ ఆ ఎన్నికలలో బిజెపి గెలిస్తే, జనసేన దానితో కలిసి పోటీ చేస్తుందని, ఒకవేళ ఓడిపోతే ఏపీలో కూడా నష్టపోకూడదని కోరుకొంటుంది కనుక టిడిపి, జనసేనలతో కలిసి పనిచేసేందుకు ఒప్పించవచ్చని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భావిస్తునట్లు సమాచారం. అందుకు బిజెపి ఒప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ బిజెపికి గుడ్ బై చెప్పేసి టిడిపితో పొత్తులు పెట్టుకొనే అవకాశం కనిపిస్తోంది.
ఒకవేళ కర్నాటకలో బిజెపి గెలిచి ఏపీలో బిజెపి-జనసేనలు కలిసి పోటీకి సిద్దమైనా అప్పుడూ టిడిపి నష్టపోకుండా చూస్తామని బిజెపి హామీ ఇవ్వాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ షరతు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే టిడిపి, జనసేనలు పొత్తుల విషయంలో తొందరపడటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 10న కర్ణాటక శాసనసభ ఎన్నికలకు పోలింగ్ జరుగబోతోంది. మే 13న ఫలితాలు వస్తాయి. కనుక ఆ తర్వాత ఏపీలో పొత్తులపై పూర్తి స్పష్టత రావచ్చు. అంతవరకు వైసీపీ నేతలకు టెన్షన్ భరించక తప్పదు.



