జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తూ అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అకాల వర్షాలతో రైతన్నలు పంటలు నష్టపోయి ఆవేదన చెందుతుంటే ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నేను ఏ రైతన్నను కలిసినా అందరూ ఒకటే చెపుతున్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ధాన్యం కొనుగోలు చేసి ఉండి ఉంటే మేము ఈరోజు ఇంతగా నష్టపోయి ఉండేవారంకామని చెపుతున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం గోనె సంచులు సరఫరా చేసినా వర్షంలో ధాన్యం తడిసిపోకుండా కాపాడుకొని ఉండేవారమని రైతన్నలు చెపుతున్నారు. మేము రైతులను పరామర్శించడానికి వస్తున్నామని తెలియగానే ప్రభుత్వం రాత్రికి రాత్రి గోనె సంచులు, లారీలను ఏర్పాటు చేసి హడావుడిగా ధాన్యం తరలిస్తోంది. అంటే ప్రతిపక్షనేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు బయలుదేరితే తప్ప వైసీపీ ప్రభుత్వం పనిచేయదా?రైతులను ఆదుకోదా? ప్రతీసారీ ఎవరో ఒకరు వచ్చి వేలెత్తి చూపితేగానీ మీ ప్రభుత్వం పనిచేయదా?” అని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నాలుగైదు రోజుల క్రితమే రైతులను పరామర్శించి తక్షణం ధాన్యం కొనుగోలుచేయాలని లేకుంటే నిరసనదీక్ష చేస్తానని హెచ్చరించారు. అయినా ప్రభుత్వంలో పెద్దగా కదలిక కనిపించలేదు. అందుకే వ్యవసాయశాఖ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి ఫోటో పెట్టి ‘కనిపించుటలేదు’ అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ట్వీట్స్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో సిఎం నుంచి మంత్రుల వరకు అందరి తీరు ఒకేలా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మొన్న ఏలూరులో రైతులను పరామర్శించడానికి వెళ్ళిన ఒకే ఒక్క మంత్రిపౌరసరఫరాల మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వర రావు అక్కడ ఓ రైతన్న తన గోడు మొరపెట్టుకొంటుంటే, “ఒరేయ్ ఎర్రిపప్పా… నోరుమూసుకో…” అంటూ చులకనగా మాట్లాడారు.
రాష్ట్రంలో రైతులు పంట నష్టపోయి తల్లడిల్లుతుంటే, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు వారిని పరామర్శించలేదు. కనీసం హెలికాఫ్టర్‌లో తిరిగి ఏరియల్ సర్వే చేయలేదు. కానీ నేడు విశాఖలో తండ్రి వైఎస్సార్ విగ్రహావిష్కరణ, నేవీ మ్యూజియం ప్రారంభోత్సవానికి, చివరిగా వైసీపీ నేత ఇంట్లో జరుగుతున్నా ఓ శుభకార్యాక్రమానికి వెళుతున్నారు.
పంటలు నష్టపోయి ఆవేదన చెందుతున్న రైతులను పరామర్శించడం కంటే ఈ విగ్రహావిష్కరణలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ముఖ్యమా?అని టిడిపి ప్రశ్నిస్తోంది. టిడిపి, జనసేనల ప్రశ్నకు మంత్రులు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్ తదితరులు సమాధానాలు సిద్దం చేసుకొంటున్నట్లున్నారు. ఫ్యాన్స్ వెయింటింగ్ ఇక్కడ!



