చంద్రబాబు నాయుడు వృద్ధుడు, ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారని జగన్మోహన్ రెడ్డి, వైసీపి నేతలు ఎంతగా అవహేళన చేశారో అందరూ చూశారు. కానీ చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ప్రజల మద్యనే ఉండేవారు. జగన్ మాత్రం బటన్ నొక్కుడు సభలకు మాత్రమే తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వస్తుండేవారు.
గత 3-4 నెలలుగా శాసనసభ, లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, అభ్యర్ధుల ఎంపికతో క్షణం తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత మరో నెలన్నర పాటు మండుటెండల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ జగన్ ఎండలకు భయపడి ఏసీ బస్సులో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ‘మమ’ అనిపించేశారు.
పోలింగ్ ముగిసిన వెంటనే జగన్ లండన్ వెళ్ళిపోయి ఇంకా అక్కడే సేద తీరుతున్నారు. కానీ ఆయన తర్వాత విదేశాలకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. ఈరోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత రేపు లేదా ఎల్లుండి చంద్రబాబు నాయుడు విజయవాడ చేరుకోబోతున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు అమెరికా వెళితే ఎక్కడికి వెళ్ళారో చెప్పాలంటూ బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు వెటకారంగా అర్దం పర్ధంలేని మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఆయన వారి కళ్లెదుటే ఉన్నారు కానీ వారి అధినేత జగనే కనపడటం లేదు!
ఈసారి ఎన్నికలలో టిడిపి కూటమి గెలుపు ఖాయం అని నేతలందరూ చాలా ధీమాతో ఉన్నందున చంద్రబాబు నాయుడు విదేశీ యాత్రకు వెళ్ళినా అందరూ చాలా ఉత్సాహంగానే ఉన్నారు. ఇప్పుడు తమ అధినేత రాకతో టిడిపి శ్రేణులు మరింత ఉత్సాహంగా ఉన్నాయి.
కానీ పోలింగ్ సరళి చూసినప్పటి నుంచి వైసీపి నేతలకు ఓటమి భయం పట్టుకుంది. మరోపక్క వైసీపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కేసుతో టిడిపిని ఎదురుదెబ్బ తీద్దామని చేసిన ప్రయత్నం బెడిసికొట్టి, దాని గురించి వారే రచ్చ రచ్చ చేసుకున్నట్లయింది.
వైసీపి నేతల్లో ఇంత గందరగోళం, ఇంత ఆందోళన చెందుతున్న సమయంలో వారి అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడే కాలక్షేపం చేస్తున్నారు.
చొక్కా చేతులు మడత పెట్టి యుద్ధం సిద్ధం అంటూ ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఇంకా విదేశాలలోనే సేద తీరుతుంటే, వృద్ధుడని ముద్ర వేసిన చంద్రబాబు నాయుడు అప్పుడే తిరిగి వచ్చి అంతిమ యుద్ధానికి సిద్దం అంటున్నారు. ఇద్దరిలో ఎవరు యువకుడు… ఎవరు వృద్ధుడు?






