చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో అమరావతికి మళ్ళీ మంచిరోజులు వచ్చాయి. ఇక చకచకా పనులు జరిగిపోతుంటే చూడాలని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. కానీ జగన్ తాను అధికారంలో ఉన్నా లేకపోయినా అమరావతి నిర్మాణ పనులు జరుగకూడదనే దురాలోచనతో చేసిన కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి.
మాస్టర్ ప్లాన్‌కు విరుద్దంగా జగన్ ప్రభుత్వం ఆర్-5జోన్ ఏర్పాటు చేసింది. మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని గ్రామాలను మాస్టర్ ప్లాన్ నుంచి విడదీసి వాటితో వేరే కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.
రాజధాని ప్రాంతంలో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నవులూరు గ్రామాలలో 1,197.30 ఎకరాల భూసేకరణకు టిడిపి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
రాజధాని ప్రాంతంలో పేదలకు సెంటు భూముల పంపిణీ చేయడం, రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేయడం వంటివి చిక్కు ముడులు వేసి ఉంచారు.
ఇవి కాక పలు అంశాలపై రాజధాని రైతులు హైకోర్టు, సుప్రీంకోర్టులో వేసిన కేసులున్నాయి. రాజధానికి భూములకు బదులుగా వాణిజ్య, నివాస స్థలాలను ఇదివరకు టిడిపి ప్రభుత్వం కేటాయించింది. కానీ జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేక 25,186 మంది రైతులు వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. కనుక ఇప్పుడు వారందరితో మళ్ళీ మాట్లాడి ఒప్పించిఓ రిజిస్ట్రేషన్స్ చేయించాల్సి ఉంటుంది. అప్పుడే వారి భూములు ప్రభుత్వం స్వాధీనం అవుతాయి.
వీటిలో ప్రభుత్వపరంగా ఉన్న సమస్యలను, రైతులతో సమస్యలను ఏదో విదంగా పరిష్కరించుకోవచ్చు. కానీ న్యాయస్థానాలలో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది.
జగన్ అమరావతిని వద్దనుకుని పాడుబెట్టేయడంతో రాజధాని ప్రాంతాన్ని గుర్తు పట్టలేనంతగా దట్టమైన పిచ్చి మొక్కలు, తుప్పలు మొలిచాయి. కొన్ని భవనాల పునాదులు చుట్టూ నీళ్ళు చేరి చెరువుల్లా మారిపోగా, 65-75 శాతం నిర్మాణాలు పూర్తయిన భవనాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలయ్యాయి. అవన్నీ పూర్తిగా తొలగిస్తే కానీ ఎంత నష్టం జరిగిందో, రోడ్లు, భవనాలను పునరుద్దరించడానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయడం సాధ్యపడదు. మరో నెలరోజులలో అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తవుతాయి.
అమరావతి కోర్ క్యాపిటల్ సిటీ 217 చదరపు కిమీ పరిధిలో సీడ్ యాక్సస్ రోడ్లను నిర్మించాల్సి ఉంది. వాటికి నిధులు సిద్దం చేసుకోవలసి ఉంటుంది.
ఏది ఏమైనప్పటికీ, అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసి, ముందుగా 65-75 శాతం నిర్మాణాలు పూర్తయిన భవనాలను 9-12 నెలల్లోగా మిగిలిన పనులన్నీ పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు డెడ్‌లైన్ విధించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణ పనులకు పూర్తిగా సహకరించేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. కనుక 2025 జూలై నాటికి అమరావతికి కొంత రూపు రేఖలు వచ్చే అవకాశం ఉంది.






