టిడిపికి ఇంత జనాధారణ ఉన్నా బిజెపితో పొత్తులు అవసరమా?

Chandrababu-Naiduది రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్‌ “టైమ్ ఆఫ్ ట్రాన్స్ ఫర్మేషన్: ది నీడ్ టూ కీప్ ఫైటింగ్” పేరిట మోడీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విజన్-2047పై నిన్న ఓ సదస్సు నిర్వహించింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో తన నివాసం నుంచి దానిలో వర్చువల్‌గా పాల్గొని ‘టెక్నోక్రసీ ఫర్ డెమోక్రసీ’ అనే అంశంపై మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ విధానాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తానని చెప్పారు. ఒకప్పుడు భారత్‌ అంటే ప్రపంచదేశాలన్నీ చాలా చులకనగా చూసేవని కానీ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచే భారత్‌ పట్ల వాటి దృక్పదంలో చాలా మార్పు వచ్చిందన్నారు. భారత్‌ అంటే జనాభా, పేదరికం అనుకొనే ప్రపంచ దేశాలకు భారత్‌ అంటే అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం అని ప్రధాని నరేంద్రమోడీ గ్రహించేలా చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధిపదంలో నడిపిస్తూ ప్రపంచదేశాలలో దేశగౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి పార్టీలు, రాజకీయాలకు అతీతంగాదేశంలో ప్రతీ ఒక్కరూ అండగా నిలబడాలన్నారు. గతంలో తాను ఏపీకి ప్రత్యేకహోదా కోసం మాత్రమే కేంద్రంతో పోరాడానుతప్ప మోడీ విధానాలను ఎన్నడూ వ్యతిరేకించలేదన్నారు చంద్రబాబు నాయుడు.

ADVERTISEMENT

“అయితే బిజెపితో మళ్ళీ పొత్తు పెట్టుకొని కలిసి పనిచేయాలనుకొంటున్నారా?” అనే ప్రశ్నకు రాజకీయాలు, పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇది సరైన వేదికకాదన్నారు. కానీ ఈ వేదిక ద్వారానే బిజెపితో పొత్తులు పునరుద్దరించుకోవాలని కోరుకొంటున్నానని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగానే చెప్పారనుకోవచ్చు.

రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి (మోడీ ప్రభుత్వం) కూడా తోడ్పడాలని చంద్రబాబు నాయుడు కోరుకొంటున్నట్లు అర్దమవుతూనే ఉంది. అయితే కేవలం అధికారంలోకి రావడం కోసమే కాదు… భ్రష్టు పట్టిపోతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం కూడా ఆయన మాటలలో వినిపిస్తోంది.

కానీ మోడీ ప్రభుత్వం ఏపీలో బిజెపి రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తోంది తప్ప రాష్ట్రానికి, ప్రజల ఆకాంక్షలకు ఇవ్వడం లేదనే చెప్పాలి. కనుక గోడమీద పిల్లిలా కూర్చొని చూస్తున్న బిజెపి తోడ్పాటు కోసం చంద్రబాబు నాయుడు ఎదురుచూడటం కంటే సొంత బలంతోనే మళ్ళీ అధికారంలోకి వస్తే హుందాగా ఉంటుంది. టిడిపి రాజకీయ శక్తిసామర్ధ్యాలను మరోసారి లోకానికి చాటిచెప్పిన్నట్లవుతుంది కూడా. అప్పుడే రాష్ట్రాన్ని గాడినపెట్టుకోగలదు కూడా. టిడిపి ఇందుకు సిద్దమైతే రాష్ట్ర ప్రజలు కూడా దానికి సహకరించేందుకు సిద్దంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు వస్తున్న అపూర్వ జనధారణ తెలియజేస్తోంది కదా?కనుక బిజెపి, మోడీ దయాదాక్షిణ్యాల కోసం చంద్రబాబు నాయుడు ఎదురుచూపులు చూడవలసిన అవసరం లేదనే చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories