ఏ రాష్ట్రానికైనా పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే ఆ రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం దానికి చక్కటి ఆర్ధిక, పారిశ్రామిక విధానాలు ముఖ్యం. ఆ తర్వాతే ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు వాటిని ఆకర్షించగలవు.
ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఓసారి పరిశీలిస్తే, పారిశ్రామికవేత్తలు ఆశించే లక్షణాలన్నీ కేసీఆర్ హయాంలో ఉన్నాయి కనుకనే ఆ రాష్ట్రానికి అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, అన్ని పరిశ్రమలు, ఐటి కంపెనీలు తరలివచ్చాయి.
హైదరాబాద్‌లో ఐటి రంగానికి చంద్రబాబు నాయుడు బలమైన పునాదులువేస్తే, ఆయనను ఎంతగానో ద్వేషిస్తున్న కేసీఆర్ ఐటి రంగాన్ని వద్దనుకోకుండా ఆ దారిలో మరింత ముందుకు సాగడం వలననే తెలంగాణకు పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు ప్రవాహంలా వచ్చి పడ్డాయి.
అంటే ఒక ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలను తర్వాత వచ్చే ప్రభుత్వం గౌరవిస్తేనే ఆ రాష్ట్రానికి విశ్వసనీయత ఏర్పడుతుంది… అప్పుడే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని స్పష్టం అవుతోంది.
కానీ చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిలిపివేయించడమే తన విధానంగా జగన్ ప్రభుత్వం వ్యవహరించడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వసనీయత కోల్పోయింది.
జగన్ ప్రభుత్వం కూడా పరిశ్రమలు, పెట్టుబడులపై పెద్దగా ఆసక్తి చూపకపోగా ఉన్నవాటిని కూడా రాష్ట్రం నుంచి తరిమేస్తుండటంతో ఏపీలో పెట్టుబడులు పెట్టే ఆలోచన కూడా ఎవరూ చేయలేదు.
జగన్ అనుసరించిన ఈ మూర్ఖపు విధానం వలన ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు పెట్టుబడులు సాధించడం కంటే ముందుగా వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై నమ్మకం కల్పించడమే పెద్ద పనిగా మారిందని చంద్రబాబు నాయుడు అన్నారు.
తమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పరిశ్రమలను, పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని అందరికీ తెలిసి ఉన్నప్పటికీ 5 ఏళ్ళలో జగన్ నిర్వాకం వలన పెట్టుబడిదారులలో ఓ రకమైన అపనమ్మకం, భయం నెలకొని ఉండటం సహజమని, కనుక మీడియా కూడా రాష్ట్రం పట్ల పెట్టుబడిదారులకు నమ్మకం కలిగేలా కృషి చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.
వేలకోట్లు పెట్టుబడులు పెట్టాక ఒకవేళ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని పారిశ్రామికవేత్తలు ఆలోచించకుండా ఉండరు. కనుక జగన్ మళ్ళీ అధికారంలోకి రాలేడని చంద్రబాబు నాయుడు వారికి నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. అప్పుడే వారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. కానీ ఇది పెట్టుబడులను ఆకర్షించడం కంటే చాలా చాలా కష్టం.
అదే… జగన్ కూడా రాజకీయాలకు అతీతంగా పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పనులను యధాతధంగా కొనసాగించి ఉండి ఉంటే నేడు ఈ సమస్య ఎదురయ్యేదే కాదు కదా?కానీ జగన్ 5 ఏళ్ళలో చేసిన విధ్వంసమే కాకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ని కూడా దెబ్బ తీశారన్న మాట.
ప్రజలు ఎంతో నమ్మకంతో రాష్ట్రాన్ని జగన్ చేతిలో పెడితే చివరికి ఇటువంటి సమస్యలను కూడా సృష్టించి చేతులు దులుపుకువెళ్ళిపోయారు. అయినా రాష్ట్రానికి, ప్రజలకు తాను ఎంతో మేలు చేశానని నిసిగ్గుగా చెప్పుకుంటున్నారు.






