ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రముఖ జాతీ మీడియా ‘ఇండియా టుడే’ ప్రతినిధి రాజ్‌దీప్ సర్‌దేశాయ్ సిఎం జగన్మోహన్ రెడ్డిని, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ఇద్దరినీ ఇంటర్వ్యూ చేశారు.
చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పన, అమరావతి, పోలవరం నిర్మాణం వంటి అంశాల గురించి ఎక్కువగా మాట్లాడారు. అదే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీల కంటే సంక్షేమ పధకాలతో స్వయం ఉపాధి లభిస్తే రాష్ట్రం ఆర్ధికంగా అభివృద్ధి సాధించగలదంటూ తన సంక్షేమ వైఖరిని గట్టిగా సమర్ధించుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడుని రాజ్‌దీప్ సర్‌దేశాయ్ అడిగిన ఓ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. “మీకూ, జగన్‌కూ మద్య రాజకీయ శతృత్వం ఉంది కనుక అందుకే ఆయనను ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.
“నేను నా కోసం జగన్‌తో పోరాడటం లేదు. ఆయన చేతిలో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిపించుకొని, రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడుకునేందుకు పోరాడుతున్నాను. అసలు జగన్ గురించి చెప్పుకోవడానికి ఏముంది? రాజకీయంగా గొప్పవాడా? పోనీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడా?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజలు గర్వపడే పనేమైనా చేశాడా? ఏమీ లేదు కదా?అటువంటి వాడితో నేను పోటీ పడాల్సిన అవసరమే లేదు,” అని చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పారు.
“ఐదేళ్ళ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో భ్రష్టు పట్టించేశాడు. సుమారు రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశాడు. నా రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంటే నాకెందుకని చూస్తూ ఊరుకోలేను. కనుకనే నేను జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి, ఏపీని మళ్ళీ గాడిన పెట్టుకోవాలనుకుంటున్నాను,” అని చెప్పారు.
కానీ ఇదే ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని అడిగినప్పుడు, సంక్షేమ పధకాలతో రాష్ట్రాభివృద్ధి చేస్తున్నందున తాను మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకొంటున్నారని చెప్పారు.
ఏపీలో టిడిపి, వైసీపిలు బలంగా ఉన్నప్పటికీ ఎన్నికలొచ్చేసరికి కేంద్రం వైపు ఎందుకు చూస్తాయి? దాని సహాయసహకారాలు ఎందుకు కోరుకొంటాయి?ఆనాడు మోదీతో విభేదించిన ఎన్డీయేకి దూరమైన మీరు మళ్ళీ ఇప్పుడు అదే మోదీతో చేతులు కలిపారు… ఇది అవకాశవాద రాజకీయాలు కావా? అనే ప్రశ్నకు చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పారు.
“జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసమే మోడీతో విధేయంగా ఉన్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. కానీ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందనే ఆశతోనే బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాను. ప్రధాని నరేంద్రమోడీ కూడా దేశాభివృద్ధికే చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. కనుక మాకు ఆయన, ఆయనకు మేము సకరించుకుంటూ రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తాము,” అని చంద్రబాబు నాయుడు చెప్పారు.
గతంలో మోడీపై చంద్రబాబు నాయుడు కత్తులు దూసి, ఇప్పుడు మళ్ళీ చేతులు కలపడం గురించి కూడా రాజ్‌దీప్ సర్‌దేశాయ్ సూటిగా ప్రశ్నించారు. దానికీ చంద్రబాబు నాయుడు సూటిగానే సమాధానం చెప్పారు. ఆనాడు ప్రత్యేక హోదా కోసమే నేను మోడీతో విభేదించాను తప్ప వ్యక్తిగతంగా ఆయనతో నాకు ఎటువంటి శతృత్వం లేదు. ఇదే విషయం అప్పుడూ చెప్పాను. ఇప్పుడూ చెపుతున్నాను,” అని చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పారు.
“బీజేపీ మతతత్వ పార్టీ. మీది సెక్యులర్ పార్టీ. అయినా మోడీతో కలిసి ప్రయాణిస్తారా? బీజేపీ మతతత్వంతో ఎలా సర్దుకుపోతారు? ఈ పొత్తులు ఈ ఎన్నికల వరకేనా ఇక ముందు కూడా కొనసాగుతాయా?” అనే ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది.
మా పార్టీ ఎప్పుడూ సెక్యులిరిజానికే కట్టుబడి ఉంది. మేము అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు కూడా సమానావకాశాలు కల్పించాము తప్ప వారిని వేరేగా చూడలేదు. ఇప్పటికీ మా వైఖరి అలాగే ఉంది.
నాది, ప్రధాని నరేంద్రమోడీదీ ఇద్దరి ప్రధాన అజెండా దేశం, రాష్ట్రం అభివృద్ధి చేయడమే. కనుక మేము కలిసి ప్రయాణించడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నాను,” అని చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పారు.
చంద్రబాబు నాయుడుకి చాలా ఇబ్బంది కలిగించే ప్రశ్నలకు కూడా తడబడకుండా సూటిగా సమాధానాలు చెప్పగా, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన వంటి రాష్ట్రానికి సంబందించిన అడిగిన ప్రశ్నకు కూడా జగన్మోహన్ రెడ్డి జవాబు చెప్పలేక తడబడ్డారు. ఇదే ఇద్దరి మద్య తేడా!




