జగన్ ఢిల్లీ ధర్నాకు వైసీపి చెప్పిన కారణం ఒకటికాగా అసలు కారణం వేరే ఉంది. అదే… కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడం. కాంగ్రెస్ మిత్రపక్ష నేతలు జగన్‌కు సంఘీభావం తెలుపగా, పార్లమెంట్‌లో వైసీపి వారికి సంఘీభావం తెలిపింది. అంటే ఢిల్లీ ధర్నాలో వారి మద్య రాజకీయ బేరసారాలు సఫలం అయ్యాయని భావించవచ్చు.
లోక్‌సభలో మోడీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు, దానిని వైసీపి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. తద్వారా కాంగ్రెస్ మిత్రపక్షాలతో చేతులు కలిపి మోడీ ప్రభుత్వంపై జగన్ కత్తి దూసిన్నట్లయింది.
Also Read – పవన్ ఇచ్చేశారు… జగన్ పుచ్చుకుంటున్నారు!
వైసీపి, బీజేపీల మద్య ఎటువంటి పొత్తు, బంధం లేనప్పటికీ గత 5 ఏళ్ళుగా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ బిల్లుకి వైసీపి బేషరతుగా మద్దతు ఇస్తూనే ఉంది. జగన్ అక్రమాస్తుల కేసు, వివేకా హత్య కేసులను యధాతధ స్థితిలో ఉంచేందుకే ఇంతకాలం జగన్ మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ విధేయంగా మెసులుకున్నారనేది అందరికీ తెలిసిన రహస్యం.
కానీ ఇప్పుడు ఎన్డీయేలోకి టిడిపి ప్రవేశించడంతో, వైసీపి మద్దతు ఇస్తే మోడీ ప్రభుత్వం స్వీకరించగలదేమో కానీ ఆదరించే పరిస్థితి లేదు. ఎన్నికలలో ఓటమి తర్వాత ఇలాగే జరుగుతుందని తెలియనంత అమాయకుడు కారు జగన్.
Also Read – కేసీఆర్ ఊసుపోక యాగాలు చేయలేదు స్మీ!
అందుకే కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నానని మోడీ ప్రభుత్వానికి సంకేతాలు పంపిస్తూనే ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో బేరసారాలు సాగించేందుకే జగన్ పదేపదే బెంగళూరు పర్యటిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
చివరి ప్రయత్నంగా విజయసాయి రెడ్డిని కేంద్ర హోంమంత్రి అమిత్ షావద్దకు పంపించి రాయబారం కూడా చేశారు. కానీ అది ఫలించలేదని జగన్ అక్రమాస్తుల కేసుల విచారణని వేగవంతం చేయాలనే సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో స్పష్టం అయ్యింది.
Also Read – టీడీపీలో ఆరోపణలు వచ్చాయి..ఆదేశాలు వెళ్లాయి..మరి వైసీపీలో.?
వివేకా హత్య కేసు విషయంలో సునీతా రెడ్డి ఏపీ హోమ్ మంత్రి అనిత వంగలపూడిని కలవడం యాదృచ్ఛికంగా జరిగినవి కావు. రెండు కేసుల విచారణ ముందుకు సాగబోతోందని సూచిస్తున్నట్లే ఉన్నాయి.
అందువల్లే జగన్ మరో అడుగు ముందుకు వేసి, లోక్‌సభలో కాంగ్రెస్ మిత్రపక్షాలతో చేతులు కలిపారనుకోవచ్చు. లోక్‌సభలో మోడీ ప్రభుత్వాన్ని వైసీపి వ్యతిరేకించిన మర్నాడే అంటే నేడు (శుక్రవారం) జగన్ మళ్ళీ బెంగళూరు వెళుతుండటం కూడా బహుశః కాంగ్రెస్‌తో ఫైనల్ బేరానికే కావచ్చు.
జగన్ కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారని, కలిపితే ఏమవుతుందో సిఎం చంద్రబాబు నాయుడుకి కూడా బాగా తెలుసు. కనుక ఆయన కూడా పావులు కదపక తప్పదు. బహుశః అందుకే పవన్ కళ్యాణ్‌ని బెంగళూరు పంపించి ఉండవచ్చు.
కుంగి ఏనుగుల కోసం కర్ణాటక సిఎంతో పవన్ కళ్యాణ్ భేటీ బహుశః ఓ సాకు మాత్రమే కావచ్చు. కాంగ్రెస్ పార్టీ జగన్‌తో చేతులు కలిపితే అటు తెలంగాణ కాంగ్రెస్‌కు, ఇటు ఏపీలో టిడిపికి ఇబ్బందికరంగా మారుతుందని పవన్ కళ్యాణ్ ద్వారా సిఎం చంద్రబాబు నాయుడు సందేశం పంపించి ఉండవచ్చు.
కనుక టిడిపి, వైసీపి, కాంగ్రెస్, బీజేపీల మద్య తెర వెనుక జరుగుతున్న ఈ రాజకీయాలు ఏ మలుపు తిరుగబోతున్నాయో, వాటిలో ఎవరు పైచేయి సాధిస్తారో… వాటితో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో రాబోయే రోజుల్లో చూడబోతున్నాము.