ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన చేసిందుకు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపి, బీజేపి వంటి అనేక పార్టీలు ఒకసారి ఎన్నికలలో ఓడిపోయినా మరోసారి అధికారంలోకి వస్తూనే ఉన్నాయి.\
కానీ ఏపీ కాంగ్రెస్ మాత్రం ఇక కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎందువల్ల అంటే రాష్ట్ర విభజన చేయడం పొరపాటు, దాని వలన ఏపీ నష్టపోయిందని కాంగ్రెస్ పార్టీ అంగీకరించి చెప్పుకోలేదు కనుక!
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, అమరావతి నిర్మాణం, రాష్ట్రాభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి పెట్టి రాజకీయాలను విస్మరించారు.
దీనినే వైసీపీ అనుకూలంగా మార్చుకొని అధికారంలోకి రాగలిగింది. చంద్రబాబు నాయుడు అప్పుడు జరిగిన తప్పులు, లోపాలను గుర్తించి, సరిదిద్దుకొని ఇప్పుడు రాజకీయాలను కూడా బ్యాలన్స్ చేసుకుంటూ పాలిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడులో మార్పు సామాన్య ప్రజలు కూడా గుర్తించగలుగుతున్నారు. ఆయన మాత్రమే కాదు… డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని రాటుతేలారు. కనుకనే నేడు ఈ స్థాయికి చేరుకోగలిగారు.
నేటికీ వీరు ముగ్గురూ తమని తాము సాన పట్టుకుంటూనే ఉన్నారు. తప్పులుంటే సరిచేసుకుంటూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నారు.
కానీ జగన్ అటువంటి పాఠాలు, మార్పులు తనకు అవసరం లేదని గట్టి నమ్మకంతో ఉన్నారు. అందువల్లే మూస రాజకీయాలతో తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని రాజకీయ చదరంగం ఆడుతూ గెలవలాని ఆశ పడుతున్నారు. తనని తాను సరిచేసుకునే ప్రయత్నం చేయకపోగా ఈ లోపాలతో కూడిన తనను, తన పార్టీని ఏపీ ప్రజలు యధాతధంగా స్వీకరించాలని జగన్ ఆశిస్తున్నారు. అది సాధ్యమేనా? ఆలోచించుకుంటే మంచిది.




