మళ్ళీ నర్సాపురం టికెట్ ఆశించిన రఘురామ కృష్ణరాజుకి ఆ టికెట్ దక్కేలా చేసేందుకు చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నించారు. కానీ కుదరకపోవడంతో టిడిపిలో చేర్చుకొని న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. కానీ జనసేనలోనే ఉన్న పోతిన మహేష్‌కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేకపోయారు!
పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ టికెట్ ఆశించగా, పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి దకింది. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్ధిగా సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు.
దీంతో పోతిన మహేష్ తీవ్ర నిరాశ చెందారు. పవన్ కళ్యాణ్‌ని కలిసి తన ఆవేదన చెప్పాలని ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్‌తో ముఖాముఖీ మాట్లాడే అవకాశం లభించకపోయినా తన అసంతృప్తిని ఆయనకు తెలిసేలా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా పోతిన మహేష్ జనసేనాని పవన్ కళ్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. “మేము రాజకీయాలలోకి వచ్చి ఆస్తులు అమ్ముకొన్నాము. కానీ మీరు కొనుకొన్నారు. మా కన్నీరు, కష్టం, రక్తమాంసాల పునాదులపై మీరు జనసేన భవంతులని నిర్మించుకున్నారు” అని ఆరోపించారు.
ఏ పార్టీలో అయినా టికెట్ ఆశిస్తున్నావారు తమ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు, సభలు సమావేశాలు, నిరసన ర్యాలీలు, సామాజిక సేవ కార్యక్రమాల కోసం, ఫ్లెక్సీ బ్యానర్ల కొరకు, మీడియాలో ప్రచారం కొరకు గట్టిగానే ఖర్చుపెడుతుంటారనేది అందరికీ తెలిసినదే.
పోతిన మహేష్‌కి కూడా పవన్ కళ్యాణ్ నుంచి అటువంటి హామీ లభించినందునే ఖర్చు పెట్టి ఉంటారని వేరే చెప్పక్కరలేదు. ఆస్తులు అమ్ముకోవడం అంటే ఇదే!
తనకు తప్పక టికెట్ లభిస్తుందనే నమ్మకంతో పోతిన మహేష్ వంటి నేతలు ఇన్నేళ్ళు కష్టపడి పనిచేసినందునే నేడు జనసేనకు ప్రజలలో ఇంత ఆదరణ లభిస్తోందని చెప్పవచ్చు. పార్టీ కోసం తమ డబ్బు, సమయం, శ్రమ అన్ని ఖర్చు పెట్టిన వారికి టికెట్ రాకపోతే వారు చాలా బాధపడటం, ఆ కోపంతో ఏవో విమర్శలు, ఆరోపణలు చేయడం కూడా సహజమే. పోతిన మహేష్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు.
జనసేనతో పోలిస్తే టిడిపి చాలా ఏళ్ళుగా రాజకీయాలలో ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు హయాంలో అధికారంలో కూడా ఉంది. అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడింది కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను, కార్యకర్తలను కాపాడుకొంటున్నారు కనుక.
రఘురామ కృష్ణరాజు టిడిపి నేత కానప్పటికీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కనుక ఆయనకు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వలేకపోయినా అక్కున చేర్చుకున్నారు. అందుకు ప్రతిగా ఆయన టిడిపి గెలుపుకి ఉడతా భక్తిగా సహకరిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ ఇటువంటి విషయాలు నేర్చుకొంటూ ముందుకు సాగాలి. అప్పుడే పార్టీ నాయకులు, కార్యకర్తలకు అధినేతపై నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం ఉన్నప్పుడూ పార్టీ ఇంకా బలపడుతుంది కూడా!ఇప్పుడిప్పుడే బలపడుతున్న జనసేనకు మూల స్తంభాల వంటి కీలక నేతలను చేజార్చుకోకుండా కాపాడుకోవడం చాలా అవసరం. అది పోతిన మహేష్ కావచ్చు మరొకరు కావచ్చు.




