హిట్ అండ్ రన్… ఇంకా ఎంత కాలం?

Chandrababu Naidu and Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్‌ సిఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేసే విధానాన్ని ‘హిట్ అండ్ రన్’తో పోల్చారు. తమ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసి వెంటనే బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ ప్యాలస్‌లో దాక్కుంటారన్నారు.

డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ జగన్‌ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి.

ADVERTISEMENT

సోమవారం శాసనసభలో డీఎస్సీపై సుదీర్గంగా చర్చ జరుగుతున్నప్పుడు, జగన్‌ హాజరయ్యి తన వాదనలు వినిపించవచ్చు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటున్నారు కనుక వాటికి సంబందించిన సాక్ష్యాధారాలు చూపించి, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయవచ్చు. కానీ జగన్‌ ఎప్పటిలాగే శాసనసభకు రాకుండా ‘హిట్ అండ్ రన్’ విధానం పాటించారని సిఎం చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా ఇదే ప్రశ్నించారు. సమావేశాలు మరో నాలుగు రోజులు సాగుతాయి. కనుక ఇప్పటికైనా జగన్‌ ధైర్యం చేసి శాసనసభకు రావాలని సవాల్ విసిరారు. వస్తే అయన అడిగే ప్రతీ ప్రశ్నకు నేనే స్వయంగా సమాధానాలు చెప్తానని మంత్రి నారా లోకేష్‌ అన్నారు.

అంతే కాదు.. ఈ ఏడాదిలోనే మరో డీఎస్సీ ద్వారా మరో 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు.

“డీఎస్సీపై ఇన్ని అభ్యంతరాలున్నప్పుడు, బయట ఇంత హడావుడి చేస్తున్నప్పుడు.. శాసనసభకు వచ్చి మమ్మల్ని నిలదీయొచ్చు కదా? కానీ ఎందుకు రావడం లేదు?భయమా?” అని సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ అడుగుతున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒంటరిగా శాసనసభలో వైసీపీ సభ్యులను ఎదుర్కొన్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో ‘నేను సింగిల్ సింహం, కృష్ణుడు, అర్జునుడు’ వంటివాడినని గొప్పలు చెప్పుకునే జగన్‌ శాసనసభకు వచ్చేందుకు భయపడుతున్నారు!

తనకున్న ఎమ్మెల్యేల సంఖ్యా బలానికి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా రాదని తెలిసి ఉన్నా దాని కోసం పట్టుబడుతున్నారు. ఈ సాకుతో రాకుండా తప్పించుకుంటున్నారు. కానీ ఆయనకు ఆ హోదా ఇవ్వకపోయినా శాసనసభలో ఆయనే ఏకైక ప్రతిపక్ష నాయకుడు కదా?

నాడు శాసనసభలో చంద్రబాబు నాయుడుని దారుణంగా అవమానించారు కనుక ఇప్పుడు తనను టీడీపి సభ్యులు అలాగే అవమానిస్తారనే భయంతోనే జగన్‌ శాసనసభకు హాజరవడం లేదని అందరికీ తెలుసు. ఒకవేళ టీడీపి సభ్యులు అప్పుడు జగన్‌ శాసనసభ నుంచి వాకవుట్ చేసి ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుకొని సానుభూతి పొందవచ్చు కదా?

డీఎస్సీ గురించి శాసనసభలో టీడీపి చెప్తున్న మాటలు ప్రజలకు బలంగా చేరుతున్నాయి. కానీ ఈవిధంగా ఇగో సమస్యతో శాసనసభకు రాకుండా ‘హిట్ అండ్ రన్’ రాజకీయాలు చేస్తుంటే, అయన మాటలపై ప్రజలకు నమ్మకం ఎలా ఏర్పడుతుంది? పైగా తన పట్ల ప్రజలలో దురభిప్రాయం ఏర్పడేలా చేసుకుంటున్నారు కూడా!

ADVERTISEMENT
Latest Stories