చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అనేక అభివృద్ది పనులు చేపట్టినప్పటికీ ఓటమి తప్పలేదు. అభివృద్ధితో ప్రజలను మెప్పించలేమనుకున్న జగన్మోహన్ రెడ్డి, 5 ఏళ్ళు చాలా నిష్టగా సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచిపెట్టారు. అయినా ప్రజలు తిరస్కరించారు.
కనుక అభివృద్ధి+ సంక్షేమ పధకాల మిక్స్ పాలనతో సిఎం చంద్రబాబు నాయుడు మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. కనుక దీని ఫలితం ఎలా ఉంటుందో 2029 ఎన్నికల తర్వాత తెలుస్తుంది.
సిఎం చంద్రబాబు నాయుడు ఈ మిక్స్ పాలన చేస్తూనే నిత్యం ప్రజల మధ్యకు వెళ్ళి వారి కష్ట సుఖాలు తెలుసుకొని మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, గూగుల్ వంటి అతి పెద్ద కంపెనీలు తీసుకువస్తున్నారు. అమరావతి, పోలవరం పనులు పరుగులు పెట్టిస్తున్నారు. వీటన్నిటి గురించి జోరుగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు.
అలాగే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో సంబంధాలు మరింత మెరుగు పరుచుకుంటున్నారు. కూటమిలో పార్టీలన్నీ తన మాట జవ దాటకుండా అన్నీ కలిసి కట్టుగా పని చేసేలా చేస్తున్నారు. పనిలో పనిగా వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూనే ఉన్నారు.
ఇవన్నీ కలిపి చూస్తే ఈసారి చంద్రబాబు నాయుడు సవ్యసాచిలా అన్ని పనులు ఒకేసారి చక్కబెట్టేస్తున్నారని అర్ధమవుతుంది.
కనుక ఆయన కంటే చాలా తెలివైనవాడినని గట్టిగా నమ్మే జగన్మోహన్ రెడ్డి కూడా సరికొత్త పంధాలో రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏం చేస్తున్నారు?
పాడిందే పాట అన్నట్లు చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తన పాలన స్వర్ణయుగం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. సొంత, సోషల్ మీడియాలో మీడియాలో కూడా అదే పాట పాడిస్తున్నారు.
అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ కళ్యాణ్‌ని రెచ్చగొట్టి బయటకు లాగేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాగే నందమూరి కుటుంబంలో కూడా చిచ్చు రగిలించి చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ప్రజల మధ్యకు, శాసనసభకు రాకుండా పార్టీ నేతలనే ప్యాలస్‌కు పిలిపించుకొని దిశానిర్దేశం పేరుతో మళ్ళీ మళ్ళీ అదే పాట పాడుతున్నారు. ఎన్ని ప్రెస్‌మీట్లు పెట్టినా మళ్ళీ మళ్ళీ ఇదే పాచి పాట పాడుతున్నారు.
ఈ నేపధ్యంలో ఇద్దరి తీరుని గమనిస్తే సిఎం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అందుకోలేనంత దూరం వెళ్ళిపోయారని అర్ధమవుతోంది. ఇదివరకులా ధీమాగా కాలక్షేపం చేయకుండా వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారని అర్ధమవుతుంది.
ఇవన్నీ జగన్ కళ్ళారా చూస్తున్నా ఆలోచనా విధానంలో, రాజకీయ ధోరణిలో ఎటువంటి మార్పు కనబడటమే లేదు. అధికారంలో ఉన్న వృద్ధుడు ఇంతగా కష్టపడుతూ, ఇంత దూరదృష్టితో అన్నీ ప్లాన్ చేసుకొని దూసుకుపోతుంటే, యువకుడనే అదనపు అర్హత కలిగిన జగన్ ప్యాలస్ గడప దాటడం లేదు.
ప్యాలస్ రాజకీయాలు మానుకోవడం లేదు. అన్నీ చేసినా గెలుస్తామనే గ్యారెంటీ లేనప్పుడు ఏమీ చేయకుండా ఈ విదంగా కాలక్షేపం చేస్తుంటే మళ్ళీ ఎప్పటికైనా వైసీపీ అధికారంలోకి రాగలదా?ఆయనకి తెలియకపోతే వైసీపీ మేధావులైనా చెప్పాలి కదా?







