బాబు ఓర్పు – సహనం’…పార్టీకే చేటు.

Chandrababu’s Patience Turns Risky for TDP’s Unity

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు తన పార్టీని, పార్టీ నాయకులను ఎంతో క్రమశిక్షణగా ఉంచుతారు. బాబు పాలనకు విజనరీ నాయకుడు అని గుర్తింపు దక్కినట్టే బాబు నాయకత్వానికి కూడా పని రాక్షసుడు అనే పేరు వచ్చింది.

పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బాబు తానూ పడుకోడు తనతోటి వారిని పడుకోనివ్వరు అనేది తెలుగు రాష్ట్ర రాజకీయాలలో బలంగా వినిపించే ఒక నానుడి. అలాగే పార్టీ అంతర్గత విషయాల పట్ల బహిర్గత ప్రకటనలు ఉండకూడదు, పార్టీలో నాయకుల మధ్య సమన్వయ లోపాలు పార్టీకి, ప్రజలకు హాని కలిగించకూడదు అనే సిద్ధాంతంతో బాబు రాజకీయం చేస్తారు.

ADVERTISEMENT

అలాగే పార్టీ నాయకుల నుంచి వచ్చే ముందస్తు వ్యతిరేక స్వరాల విషయంలో బాబు చివరి వరకు ఓర్పు పట్టడం, సహనం పాటించడం అవి తిరిగి పార్టీకే చేటు చేస్తున్నాయి అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. అలాగే దాని తాలూకా భవిష్యత్ లో పార్టీకి, తనకి ఎదురయ్యే పర్యవసానాలను అంచనా వేయలేకపోతున్నారు.

బాబు చూపించే ఆ “ఓర్పే కొడాలి నాని దుస్సాహసాలకు, రోజా దురాగతాలకు కారణమయ్యింది. ఆ సహనమే వల్లభనేని వంశీ ని హద్దులు దాటేలా చేసింది, కేశినేని నాని దుర్భాషలకు” కారణమయ్యింది. అయినా ఇప్పటికి బాబు రాజకీయంలో ఆ ఓర్పు ఈ సహనం ప్రముఖ పాత్ర పోషిస్తూనే ఉన్నాయన్నది కొలికిపూడి విషయంలో తేటతెల్లమవుతుంది.

కూటమి వేవ్ లో కొట్టుకొచ్చిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పార్టీ గెలిచిన నాటి నుంచి తన నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసుకునేది పోయి పార్టీ ప్రతిష్టను అంతకంతకు దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారు. కనీసం పార్టీ శ్రేణులను కూడా మెప్పించలేకపోతున్న ఈ నాయకుడు టీడీపీ కి అవసరమా అంటూ అధినేత కు వినతులు వెల్లువెత్తుతున్నాయి.

నిత్యం వివాదాలతో స్నేహం చేస్తూ అటు ప్రజలలోను పలుచనవుతు ఇటు పార్టీని పలుచన చేస్తున్నారు. ఇటువంటి నాయకుల పట్ల బాబు ఓర్పు వహించడం, సహనం పాటించడం అంటే మరో కొడాలిని ఇంకో వల్లభనేని తయారు చేసినట్టే అవుతుంది.

గతంలో వల్లభనేని వంశీ విషయంలో కూడా ఆయన వైసీపీ కి దగ్గరవుతున్నారని, అతి త్వరలో వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని, జగన్ కు కోవర్ట్ గా మారుతున్నారనే విషయం చాల కాలం మీడియాలో ప్రచారంలో ఉన్నప్పటికీ బాబు తొందరపడలేదు. వంశీ పై వేటు వెయ్యలేదు.

అదే అవకాశంగా చివరికి వంశీ తన నియోజకవర్గంలో టీడీపీ కి ప్రత్యామ్నాయ నాయకుడు అనేది ఎదగకుండా చేసి పార్టీకి చేటు చేసారు. కొడాలి, రోజా విషయంలోనూ పార్టీకి గట్టి దెబ్బ తగిలే వరకు ఓర్పు వహించి చివరికి తానూ పెంచి పోషించిన నేతల తోనే నానా చివాట్లు తిన్నారు.

ఇప్పుడు కూడా బాబు ఓర్పు పార్టీ వ్యతిరేకులకు ఆయుధంగా మారుతుంది. కొలికపూడి మొదటిసారి ఎమ్మెల్యే గా నెగ్గితేనే ఇంతలా రోజుకో రచ్చ చేస్తున్నారు, పార్టీ అధినేత పిలిచి మందలించినప్పటికీ తీరు మార్చుకోకుండా వ్యవహరిస్తున్నారు. దానికి తోడు వైసీపీ కోవర్ట్ అంటూ సొంత పార్టీ శ్రేణుల నుంచే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

ఇటువంటి తరుణంలో బాబు ఇప్పటికైనా త్వరపడి పార్టీ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని కొలికపూడి పంచాయితీకి ఒక ఎండ్ కార్డు వెయ్యాలంటూ పార్టీ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అలాగే ఇలాంటి నేతల ఏరివేతలలో బాబు నిర్ధాక్షణ్యంగా వ్యవహరించాలి అంటూ కోరుతున్నారు టీడీపీ తమ్ముళ్లు.

ADVERTISEMENT
Latest Stories