Palnadu Violence After Elections

ఎన్నికల సమయంలో ఓటమి భయం ఉన్న రాజకీయ పార్టీలు అల్లర్లు, విధ్వంసానికి పాల్పడుతుంటాయి. ఈసారి ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సమయంలో వైసీపి శ్రేణులు ఎంతగా పేట్రేగిపోయాయో అందరూ చూశారు. అయినా ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ కుమార్‌ మీనా సర్టిఫై చేశారు.

ఎన్నికలైపోయిన తర్వాత కూడా వైసీపి నేతలు రెచ్చిపోతూనే ఉన్నారు. కానీ ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. పల్నాడు, తిరుపతి, అనంతపురం, కర్నూలు జిల్లాలలో చెలరేగిన హింసాత్మక ఘటనలు చూస్తే, ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమా లేక బిహార్‌లో ఉన్నామా? అనే అనుమానం కలుగక మానదు.

Also Read – ఈ విషయంలో జగన్, కేసీఆర్‌ దొందూ దొందేనా?

తిరుపతిలో చంద్రగిరి టిడిపి అభ్యర్ధి పులవర్తి నానిపై మంగళవారం వైసీపి మూకలు దాడి చేశాయి. దీంతో చంద్రగిరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన భార్య సుధారెడ్డి దాడికి సంబందించి సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

ఏమంటే, జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు తాము ఏమీ చేయలేమని ఎస్పీ చెప్పడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూసి పోలీసులే భయపడుతుంటే ఇక తమని ఏం కాపాడుతారని ఆమె ప్రశ్నించారు. తన భర్తను, తన కుటుంబాన్ని టిడిపి శ్రేణులే కాపాడుకుంటాయని ఆమె అన్నారు.

Also Read – మాచర్లకు నో ఎంట్రీ..!

ఆళ్ళగడ్డలో మంగళవారం రాత్రి టిడిపికి చెందిన భూమా అఖిలప్రియ బాడీ గార్డు నిఖిల్‌ని కొందరు కారుతో గుద్దించి చంపేయాలని ప్రయత్నించారు. కానీ అతను తప్పించుకోవడంతో గూండాలు కారు ఆపి నిఖిల్‌ని హత్య చేసేందుకు వెంట పడ్డారు. కానీ ఆయన అఖిలప్రియా ఇంట్లోకి పారిపోయి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నారు.

పోలింగ్‌ తర్వాత పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాలలో వైసీపి శ్రేణులు రెచ్చిపోయి టిడిపి కార్యకర్తలపై దాడులకు తెగబడ్డాయి. అలాగే నరరావు పేటలో నియోజకవర్గంలో కూడా వైసీపి శ్రేణులు రెచ్చిపోయాయి.

Also Read – ఏడ్పులు పెడబొబ్బలు, ప్రమాణస్వీకారం… దేనిదారి దానిదే!

పోలింగ్‌ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడులు, విధ్వంసంపై టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే వైసీపి నేతలు తమపై దాడులకు తెగబడుతున్నారని వర్ల రామయ్య ఆరోపించారు.

వైసీపి నేతలు ఇంకా తాము అధికారంలోనే ఉన్నామని మిడిసిపడుతున్నారని, కానీ వారిది ఆపద్ధర్మ ప్రభుత్వమని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పుడు తాము జగన్‌ ప్రభుత్వం అధీనంలో కాక ఎన్నికల కమీషన్ అధీనంలో పనిచేస్తున్నామనే విషయం గుర్తుపెట్టుకొని స్వైరవిహారం చేస్తున్న వైసీపి గూండాలను కట్టడి చేయాలని కోరారు.

టిడిపి నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న వైసీపి నేతలను, కార్యకర్తలను తక్షణమే అరెస్ట్ చేసి ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడాలని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. త్వరలోనే తాము మాచర్లలో పర్యటించి అక్కడి టిడిపి కార్యకర్తలకు ధైర్యం చెప్పి పరిస్థితిని సమీక్షించి, గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఏపీలో జరుగుతున్న ఈ అల్లర్ల గురించి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని వర్ల రామయ్య చెప్పారు.

పోలింగ్‌ తర్వాత పల్నాడు జిల్లాలో జరుగుతున్న ఈ దాడులకు వైసీపి ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి (గురజాల), గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి (నరసారావు పేట), పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (మాచర్ల), ఆయన సోదరుడు వెంకటరామి రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాలలో 144 సెక్షన్ విధించి భారీగా పోలీసులను, కేంద్ర బలగాలను మోహరించారు.

ఎన్నికలలో 175 సీట్లు గెలుస్తామనే నమ్మకమే వైసీపికి ఉండి ఉంటే ఈపాటికి విజయోత్సవాలు మొదలుపెట్టేసేదే కానీ టిడిపి నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందంటే అర్దం ఏమిటి? ఓడిపోతున్నామనే ఉక్రోషంతోనే కదా?ఈ 5 ఏళ్ళుగా వైసీపి నేతల దౌర్జన్యాలు, పోలీసుల వేధింపులు అన్నిటినీ భరించిన టిడిపి నేతలు, ఇప్పుడు పోలింగ్‌ తర్వాత కూడా జరుగుతున్న ఈ దాడులపై తీవ్రంగా స్పందిస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రతీ ఒక్కరిపై కటినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.